అనిత ఉవాచ: లక్ష కాదు.. 260 మాత్రమే

''లక్ష ఎకరాలు కానే కాదు.. 260 ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులు మాత్రమే ట్యాంపరింగ్‌ అయ్యాయనే ఆరోపణలున్నాయి.. ప్రతిపక్షం చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తూ, విశాఖ ఇమేజ్‌ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వమే ముందుగా…

''లక్ష ఎకరాలు కానే కాదు.. 260 ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులు మాత్రమే ట్యాంపరింగ్‌ అయ్యాయనే ఆరోపణలున్నాయి.. ప్రతిపక్షం చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తూ, విశాఖ ఇమేజ్‌ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వమే ముందుగా ఈ భూ కుంభకోణాన్ని గుర్తించి, చర్యలు చేపట్టింది..''

– టీడీపీ ఎమ్మెల్యే అనిత ఉవాచ ఇది. 

విశాఖపట్నం జిల్లాలో లక్ష ఎకరాల భూ కుంభకోణం జరిగిందని గత కొన్నాళ్ళుగా పెద్ద రచ్చ జరుగుతున్న విషయం విదితమే. హుద్‌ హుద్‌ తుపాను దెబ్బకి రికార్డులు గల్లంతయ్యాయని అధికారులు పేర్కొనడం, మరో పక్క అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డగోలుగా భూముల్ని కొల్లగొట్టడం.. వెరసి, విశాఖపట్నం పేరు జాతీయ మీడియాలోనూ మార్మోగిపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష ఎకరాల భూముల్ని అధికార పార్టీ నేతలు బొక్కేశారన్నది ప్రధాన ఆరోపణ.

విపక్షాలు మాత్రమే చేస్తున్న ఆరోపణ కాదిది.. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన నేతలు, అందునా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మరో మంత్రి గంటా శ్రీనివాసరావుపై 'భూ కుంభకోణం' ఆరోపణలు చేయడం గమనార్హం. అయ్యన్న ఆరోపణలపై ఘాటుగా స్పందించిన గంటా, ఓ అడుగు ముందుకేసి తన మీద ఆరోపణలు సబబు కాదనీ, సీబీఐ విచారణకు ఆదేశించి నిజాలు నిగ్గు తేల్చాలని సవాల్‌ విసిరేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర మరీ హాస్యాస్పదం. 

సీబీఐ విచారణ జరగాల్సిందేనని అధికార పార్టీ నుంచీ, విపక్షాల నుంచీ డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ, చంద్రబాబు సింపుల్‌గా 'సిట్‌' వేసేసి చేతులు దులిపేసుకున్నారు. సీబీఐ విచారణ అంటే ఏళ్ళ తరబడి సమయం పడ్తుందని ముఖ్యమంత్రి హోదాలో వున్న చంద్రబాబు చెప్పడం, అత్యున్నత స్థాయి సామర్థ్యం గల సీబీఐ లాంటి వ్యవస్థల మీద ఆయనకున్న గౌరవాన్ని చెప్పకనే చెబుతోంది.

ఇక, ఎమ్మెల్యే అనితపైనా విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతోంటే, ఆమె సింపుల్‌గా లక్ష ఎకరాల భూ కుంభకోణాన్ని 260 ఎకరాల కుంభకోణంగా తేల్చేశారు. అసలంటూ ఈ మొత్తం భూ కుంభకోణం వెలుగులోకి రావడానికి కారకుడైన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఎవరూ ఊహించని విధంగా సైలెంటయిపోవడం వెనుకా పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖపట్నం. ఆర్థికంగా రాష్ట్రానికి ఊతమిస్తున్న నగరం విశాఖపట్నం. జాతీయ స్థాయి సంస్థలకు నెలవు విశాఖపట్నం. ఐటీ కేంద్రంగా రాష్ట్రానికి వెలుగులు అందిస్తుందని, ఆ బాధ్య తనదేనని చెప్పుకున్న చంద్రబాబు హయాంలో లక్ష ఎకరాల భూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తే.. చంద్రబాబు సర్కార్‌ 'సిట్‌' వేసి తప్పించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?