అన్నీ స్వంత విడుదలలే

రాను రాను సినిమాల డిస్ట్రిబ్యూషన్ కష్టం అవుతోంది. భారీ సినిమా అయినా, చిన్న, మీడియం సినిమాలు అయినా డిస్ట్రిబ్యూషన్ అంత సులువుగా లేదు. మరోపక్క సినిమాలకు అయ్యే ఖర్చు ఎక్కువ. డిస్ట్రిబ్యూటర్లు ఆఫర్ చేసే…

రాను రాను సినిమాల డిస్ట్రిబ్యూషన్ కష్టం అవుతోంది. భారీ సినిమా అయినా, చిన్న, మీడియం సినిమాలు అయినా డిస్ట్రిబ్యూషన్ అంత సులువుగా లేదు. మరోపక్క సినిమాలకు అయ్యే ఖర్చు ఎక్కువ. డిస్ట్రిబ్యూటర్లు ఆఫర్ చేసే రేట్లు తక్కువ కావడంతో, యథాశక్తి అందిన కాడికి అడ్వాన్స్ లు తీసుకుని, సినిమా ఇచ్చి, కమిషన్ మీద ఆడించుకోవాల్సి వస్తోంది.

గతనెల విడుదలయిన హలో చాలా వరకు అంటే ఒకటి రెండు సెంటర్లు మినహాయించి ఇలాగే ఇవ్వాల్సి వచ్చింది. దీనికి కారణం సినిమాకు బయ్యర్లు ఆఫర్ చేసే రేటు తక్కువ కావడమే.

సంక్రాంతికి విడుదలవుతున్న జై సింహా పరిస్థితి అదే. బాలయ్య సినిమాకు నిర్మాత చెబుతున్న రేట్లకు, బయ్యర్లు అడుగుతున్న రేట్లకు పొంతన లేదు. దాంతో కమిషన్ మీద, అడ్వాన్స్ ల మీద సినిమా ఇస్తున్నారు.

ఇక సూర్య గ్యాంగ్ సినిమాను కూడా యువి క్రియేషన్స్ స్వంతంగా విడుదల చేస్తోంది. ఎక్కడా సినిమాను అమ్మలేదు. అలాగే రాజ్ తరుణ్ తో అన్నపూర్ణ నిర్మించిన రంగుల రాట్నం సినిమా కూడా అంతే. నేరుగా విడుదల చేస్తున్నారు.

పండగ వెళ్లిన తరువాత విడుదలయ్యే భాగమతి సినిమా కూడా స్వంత విడుదలే. ఈ సినిమాకు ముఫై నుంచి ముఫై అయిదు వరకు ఖర్చయింది. శాటిలైట్, డిజిటల్, అదర్ లాంగ్వేజెస్, ఇలా అన్నీ కలిపి 15వరకు రికవరీ అయింది. మిగిలిన దానికి స్వంతంగా విడుదల చేసుకుంటున్నారు.

రవితేజ టచ్ చేసి చూడు కూడా ఇంకా అమ్మకాలు స్టార్ట్ కాలేదని వినికిడి. మొత్తం మీద ఇప్పుడు పంపిణీ చేయించుకోవడమే తప్ప, చేసే సీన్లు కనిపించడం లేదు.