ఇప్పటికే నిజజీవితంలో తనో దేవుడిగా ఫీల్ అవుతున్నట్టుగా ఉంటారు పవన్ కల్యాణ్. పదేళ్లైనా కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా.. పవన్ మాటలు కోటలు దాటుతూ ఉంటారు. తన గురించి మాట్లాడితే మాత్రం ఇక శాపనార్థాలు పెట్టడం ఒక్కటే మిగిలింది! మంత్రాలు రావు కాబట్టి బతికిపోయారు కానీ, లేకపోతే శపించే వాడిని అన్నట్టుగా ఉంటుంది వారాహి మీద పవన్ కల్యాణ్ తంతు!
ఆ సంగతలా ఉంటే.. ఇప్పటికే దేవుడిగా రెండో సినిమా చేసిన పవన్ కల్యాణ్‌కు ముచ్చటగా మూడో ఆప్షన్ మిగిలి ఉంది. అదే ఓ మై గాడ్ 2 రీమేక్! హిందీలో వచ్చిన ఓ మై గాడ్ సినిమాను ఇది వరకే పవన్ కల్యాణ్ రీమేక్ చేశారు. గోపాల గోపాల పేరుతో ఆ సినిమా తెలుగులో తెరకెక్కింది. ఒక గుజరాతీ నవల ఆధారంగా ఒరిజినల్ హిందీ సినిమా రూపొందింది.
నాస్తికుడైన హీరోకి దేవుడు అందించే సహకారంతో హిందీలో ఆ సినిమా మంచి విజయం సాధించింది. హిందీలో ఒకందుకు తీస్తే.. తెలుగులో మరోటందుకు ఆ సినిమా రీమేక్ అయ్యింది. హిందీ స్థాయిలో అయితే కచ్చితంగా లేదు అది కూడా.
ఇక తమిళంలో ఆకట్టుకున్న వినోదాయ సిత్తం సినిమా రీమేక్ లో వేరే ఆర్బాటాలు ఎక్కువై, అసలు సందేశం గాలికిపోయిందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా రీమేక్స్ చేస్తున్న పవన్ కల్యాణ్ కు ఓ మై గాడ్ పార్ట్ టూ తగిన ఆప్షన్ అవుతుంది.
ఎలాగూ పవన్ కల్యాణ్ కు స్టైట్ కథలతోనో, మంచి కథలతోనో సినిమాలు చేసేంత తీరిక లేదు. ఆయన చేస్తున్న స్ట్రైట్ సినిమా ఒకటి సెట్స్ మీదే మిగిలిపోయింది. అదెప్పటికీ తెరపైకి వస్తుందో ఎవరికీ తెలియదు. ఇంతలో మరో రీమేక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడం పెద్ద కష్టం కాదు.
ఓఎంజీ 2 లో అక్షయ్ కుమారే మరోసారి దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ లో గోవిందుడి పాత్రలో కనిపించిన అక్షయ్ ఈ సారి ఈశ్వరుడిగా కనిపించబోతున్నాడు. త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది. అది హిట్టైతే.. పవన్ కు మరో రీమేక్ సబ్జెక్ట్ దొరికినట్టే!