నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో రామ్-అనుపమ కలిసి నటిస్తున్న సినిమా హలో గురూ ప్రేమకోసమే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ సందర్భంగా చిన్న గడబిడ జరిగినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. హీరోయిన్ గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ కు, సినిమాలో ఆమె తండ్రి పాత్ర పోషిస్తున్న ప్రకాష్ రాజ్ కు మధ్య కాస్త గట్టివాదన జరగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
విషయం ఏమిటంటే, సినిమాలోని ఓ కీలక సన్నివేశం స్క్రిప్ట్ తీసుకుని, ప్రకాష్ రాజ్, దాని గురించి డిస్కస్ చేయాలని అనుపమతో అన్నారట. ఆపైన ఈ సీన్ ఇలాచేస్తే బాగుంటుంది, ఇలా ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుంది అనే టైపులో ఏదోకాస్త చెప్పబోయారని తెలుస్తోంది. మరి ఎక్కడ తేడా జరిగిందో, మధ్యలో అనుపమ బరస్ట్ అయిపోయి, ‘నాకు తెలియదా? నాకు నటించడం రాదనుకుంటున్నారా? మీరు చెబుతారేంటీ? ‘అనే టైపులో ఏవేవో అనేసి, కాస్త కన్నీళ్లు పెట్టుకుని, కాస్సేపు కుర్చీలో అలా కూర్చుని వుండిపోయినట్లు విశ్వసనీయ వర్గాల బొగట్టా.
అయితే ఈ సంఘటనలో అనుపమ తప్పేమీ లేదని, డైలాగ్ క్యూ అందుకోవడంలో ఆమె కొంచెం తడబడడంతో, ప్రకాష్ రాజ్ కాస్త క్లాస్ పీకారని, అందువల్ల ఆమె బరస్ట్ అయిందన్న వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఆ తరవాత సంఘటనతో అఫెండ్ అయిన ప్రకాష్ రాజ్ సెట్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో శనివారం షూటింగ్ క్యాన్సిల్ అయింది కూడా.