మొత్తానికి బహిరంగంగా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఎవ్వరూ స్పందించకపోతున్నప్పటికీ.. ఓపెన్ ప్రకటనలు చేయకపోతున్నప్పటికీ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ రెండు ముక్కలైపోవడం ఖరారుగా కనిపిస్తోంది. ఇప్పటి టాలీవుడ్ కు మాతృక గా చెప్పదగిన స్థాయిలో ఉన్న ఒకప్పటి మదరాసు నగరం ప్రస్తుత చెన్నైకు దగ్గరగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అయ్యే చలనచిత్ర పరిశ్రమను కేంద్రీకృతం చేయాలని సినిమా పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. మద్రాసుకు కూతవేటు దూరంలో ఉండే నెల్లూరు జిల్లా తడ వద్ద సినిమా పరిశ్రమ వస్తుందని ఫిలిం సర్కిళ్లలో ఊహాగానాలు సాగుతున్నాయి.
తెలుగు పరిశ్రమలోనే అతిపెద్ద నిర్మాతల్లో ఒకరైన వారే.. పరిశ్రమ తరలింపునకు సారథ్యం వహిస్తున్నారట. వారు తమను వ్యక్తిగతంగా, ఆంతరంగికంగా కలిసిన వారితో.. పరిశ్రమను తడ వద్దకు తరలించేస్తున్నట్లుగా చాలారోజులుగా చెబుతూనే ఉన్నారు గానీ.. మీడియా ముందుకు వచ్చే సమయానికి అలాంటి అన్ని ప్రచారాల్ని స్వయంగా ఆయనే ఖండిస్తున్నారు. తెలుగు పరిశ్రమ ఎప్పటికీ ముక్కలైపోదని.. ఒక్కటిగానే ఉంటుందని.. ఎక్కడికీ తరలిపోదని.. ఆధునిక సాంకేతిక సాంకేతిక విప్లవాల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చునని ఆయన చెబుతూ వస్తున్నారు.
అయితే త్వరలోనే పరిశ్రమ రెండు ముక్కలు అవుతుందని.. ఏపీ ముక్క తడవైపు వెళ్లిపోతే.. తెలంగాణ ముక్క మాత్రం హైదరాబాదులో చిరస్థాయిగా ఉంటుందని ఫిలింనగర్లో అంతా గుసగుసలాడుకుంటున్నారు.