బాహుబలి తర్వాత ఇక సినిమాలు చేయనని దాదాపు మూడేళ్ల కిందటే ప్రకటించారు మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి. ఆ క్షణం రానే వచ్చింది. బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికపై కీరవాణి తన రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ వేడుక ప్రారంభానికి ముందే తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కీరవాణి ప్రకటించారు. ఈ ఒక్క ముక్క చెప్పడానికి ఆయన ఎంతోమందిని తిట్టారు, మరికొందర్ని పొగిడారు.
నిన్న మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు కీరవాణి ట్వీట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ట్వీట్లు మీద ట్వీట్లు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తను పక్కన ఉన్నంతవరకు రాజమౌళిని ఎవరూ టచ్ చేయలేరన్న కీరవాణి.. ఇండస్ట్రీలో ఎక్కువమంది బుర్రలేని వాళ్లతో పనిచేశానని విమర్శించారు. ఇక్కడితో ఆగకుండా పరిశ్రమలో గుడ్డి-చెవిటి దర్శకులే ఎక్కువమంది ఉన్నారని వ్యాఖ్యానించారు. కేవలం డబ్బు కోసమే అలాంటి బుద్ధిలేని దర్శకులతో పనిచేశానని చెప్పుకొచ్చారు కీరవాణి.
ఇలా కొంతమందిపై తనకున్న కోపం, ఆక్రోషాన్ని ట్వీట్ల రూపంలో తీర్చేసుకున్న కీరవాణి.. సాయంత్రం ఐదున్నరకు తన రిటైర్మెంట్ పై నిర్ణయం వెల్లడిస్తానని ప్రకటించారు. సుదీర్ఘంగా ఇన్ని ట్వీట్లు పెట్టిన తర్వాత, ఇంతమందిని తిట్టిన తర్వాత కచ్చితంగా కీరవాణి తప్పుకుంటారని అంతా గెస్ చేశారు. కానీ కీరవాణి మాత్రం తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. ఇకపై తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తానని ప్రొఫైల్ పిక్ మార్చి మరీ ప్రకటించారు.