మొత్తం మీద యూ ట్యూబ్ లో విచ్చలవిడిగా వస్తున్న చెత్త విడియోలకు కళ్లెం పడే టైమ్ దగ్గరకు వచ్చినట్లుంది. మా అసోసియేషన్ ఫిర్యాదుతో బెంగుళూరు బేస్డ్ గా వున్న దాసరి ప్రదీప్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారని వార్తలు వచ్చాయి. ఇతనికి నాలుగు యూ ట్యూబ్ చానెళ్లు వున్నాయట. అయితే ఖర్మ ఏమిటంటే, చాలా మంది సినిమా జనాలు కావచ్చు, మీడియా జనాలు కావచ్చు. వెబ్ సైట్ ఓనర్ అన్నట్లు మాట్లాడుతున్నారు.
వెబ్ సైట్ వేరు యూ ట్యూబ్ చానెల్ వేరు. ఇప్పుడు అరెస్టయిన దాసరి ప్రదీప్ అనే వ్యక్తి యూ ట్యూబ్ చానెల్ ఓనర్. అయితే ఇటీవల యూ ట్యూబ్ ద్వారా ఆదాయం సంపాదించడం అన్నది సులువైన పద్దతిగా మారింది. వెబ్ సైట్ ల్లో వచ్చే మూవీ గ్యాసిప్ లకు, సినిమా విడియో క్లిప్పింగ్ లు జోడించి అప్ లోడ్ చేయడం అన్నది సులువు అయిపోయింది. దీనికి వార్త కూడా రాయక్కరలేదు. వెబ్ సైట్ లో వచ్చిన వార్తలనే నేరుగా కాపీ కొట్టేసి మరీ చదవించేస్తున్నారు.
ఇలా చదివినందుకు బిట్ కు ఇచ్చే వాయిస్ ఓవర్ చార్జి జస్ట్ యాభై రూపాయిలు. సిస్టమ్ అవీ వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్. ఇలా ఇది చాలా సులువు కావడంతో ఇబ్బడిముబ్బడిగా మూవీ విడియోలు, యూ ట్యూబ్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఒక్క గ్యాసిప్ దొరికితే పాతిక విడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి.
అయితే ఇలాంటి విడియోలతో ప్రమాదం లేదు. కానీ మరో అడుగు ముందుకు వెళ్లి, విడియోలో విషయం వున్నా లేకున్నా, ఏదో ఒకటి శీర్షిక పెట్టేసి, అప్ లోడ్ చేసేస్తున్నారు. అందుకోసం అవసరం అయితే మార్ఫింగ్ చిత్రాలను జోడించే పని కొద్ది మంది మాత్రం చేస్తున్నారు. వీటితోనే సమస్య వస్తోంది.
మామూలు న్యూస్ లేదా గ్యాసిప్ విడియోలతో సమస్య లేదు. కానీ స్పైసీ నెస్ జోడించడం కోసం మార్పింగ్ విడియోలు వాడడం, పైగా నేరుగా పేరు పెట్టి, ఫొటోలు పెట్టి, పర్సనల్ విడియోలు తీయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు వీటిపైనే మా అసోసియేషన్ యుద్ధం ప్రారంభించింది.
ఫిర్యాదా? వినతా?
అయితే గమ్మత్తయిన విషయం ఏమిటంటే, అసలు మా అసోసియేషన్ వినతి పత్రం ఇచ్చిందా? ఫిర్యాదు చేసిందా అన్నదానిపై క్లారిటీ లేదు. పైగా ఏ యే ఛానెళ్లు లేదా వెబ్ సైట్ల పేర్లు మా అసోసియోషన్ ప్రస్తావించిందా? లేదా జాబితా అందించిందా? అన్నది ఎవ్వరూ చెప్పడం లేదు. మా ప్రతినిధులను అడిగినా సరైన సమాధానం రాకపోవడం విశేషం.
ఏమయితేనేం మొత్తానికి మా అసోసియేషన్ యూ ట్యూబ్ ల తేనెతుట్టను కదిలించింది. ఇకనైనా అశ్లీల విడియోలకు అడ్డుకట్ట పడుతుందేమో?