సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని, కొత్త అసెంబ్లీ.. అక్కడేదో కొత్తగా సమావేశాలు జరుగుతాయనీ, ఆ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చ జరుగుతుందనీ, ఆ చర్చలు సత్ఫలితాలనిస్తాయనీ, తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనీ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎదురుచూస్తున్నారు.
వందల కోట్లు వెచ్చించి, అసెంబ్లీ – శాసన మండలి భవనాల్ని అత్యద్భుతంగా నిర్మించేసింది చంద్రబాబు సర్కార్. పేరు తాత్కాలికమే అయినా, అక్కడి భవనాలు చూస్తే 'తాత్కాలికం' అన్న మాట ఎవరూ అనరు. ఏం లాభం.? అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని అన్న చందాన తయారయ్యింది పరిస్థితి. పాలకుల్లో, పార్టీల్లో, చట్ట సభల్లోని సభ్యుల్లో మార్పు రానప్పుడు, ఎంత గొప్ప టెక్నాలజీని ఉపయోగించి చట్ట సభల్ని రూపొందిస్తే మాత్రం ఏం ఉపయోగం.?
నిజం ఎప్పుడూ నిష్టూరమే.. పబ్లిక్ టాయిలెట్ల తరహాలో చట్ట సభల్లోని చర్చలు కంపు కొడుతోంటే, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వాటిని తిలకించడం సాధారణ ప్రజానీకానికి జుగుప్సాకరంగా అన్పిస్తాయి మరి.!
మంత్రిగారు సమాధానమిస్తున్నప్పుడు ప్రతిపక్ష నేత బయటకు వెళ్ళారట. అంతే, బాత్రూమ్‌కే వెళ్ళారో, ఇంకెక్కడికన్నా వెళ్ళారో.. అంటూ మంత్రిగారు దీర్ఘం తీసేశారు. ఇదెక్కడి పద్ధతి.? అంటూ, ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తే.. 'బాత్రూంకి వెళితే ఒక్కరే వెళ్ళాలిగానీ, వెనకాల నలుగురైదుగుర్ని తీసుకెళ్ళడమేంటి.?' అని మంత్రిగారు సెటైర్ వేస్తారు. ఎంత ఛండాలంగా వుందో కదా, ఈ డిస్కషన్.! వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన అసెంబ్లీని 'బాత్రూమ్‌పై చర్చ' కోసం ఉపయోగించేశారు. సిగ్గు సిగ్గు.. ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఇంకేమీ వుండదు.
ప్రతిపక్ష నేతపై 'బాత్రూమ్' విమర్శలు చేసే స్థాయికి అధికార పార్టీ, అందునా శాసనసభ వ్యవహారాల మంత్రి దిగజారిపోవడమంటే ఇది పైత్యానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. పాలకుల్ని చూసి జనం సిగ్గుపడ్తున్నారు తప్ప, ఇంత అధమ స్థాయికి తమెందుకు దిగజారిపోతున్నామో సదరు మంత్రిగారు మాత్రం ఆలోచించుకోవడంలేదు.. పైగా అదేదో ఘనకార్యమనుకుంటున్నారు.
యనమల రామకృష్ణుడుగారూ.. ‘మీ బాత్రూం పురాణానికి చంద్రబాబు మెచ్చి, మీకేమన్నా బహుమతినిస్తారనుకుంటున్నారా.? ఇదేనా చట్టసభల్లో మీరు చెప్పే 'పార్లమెంటరీ' సంప్రదాయాలు.? ఇకనైనా కాస్తంత సిగ్గుపడండి. 'సీనియర్' అంటే హుందాగా వుండాలి.. ఆ సీనియారిటీకి మచ్చతెచ్చేలా మాత్రం వుండకూడదు.