అనంతపురం వ్యవహారం సమసిపోయినట్లే కనిపిస్తోంది మీడియాకు సంబంధించినంత వరకు. కానీ తెలుగుదేశం వర్గాల గుసగుసల ప్రకారం ఈ వ్యవహారం ఇప్పటికిప్పుడు బయటకు రాలేదట. గత కొంత కాలంగా ఈ అనంతపురంలో బాలయ్య బాబు పేరు చెప్పి సాగుతున్న దందాలపై చంద్రబాబు దృష్టి పడిందని వినికిడి. బాలయ్య దగ్గర మనుషులే అనంతపురం వ్యవహారాలు చక్కబెడుతున్నారని, అప్పుడప్పుడు బెంగళూరు కేంద్రంగా వసూళ్ల కార్యక్రమం సాగిస్తున్నారని బాబు దృష్టికి విశ్వసనీయ సమాచారం వెళ్లిందట. ఫ్యామిలీ మెంబర్లు కావడం, సెన్సిటివ్ ఇష్యూ కావడంతో, దీన్ని చాలా చాకచక్యంగా డీల్ చేయాలని, తను నేరుగా కలుగ చేసుకోకూడదని బాబు డిసైడ్ కావడంతో, అనంతపురం తెలుగదేశంలో నిరసన మీట్ ల కార్యక్రమానికి తెరలేచిందని వినికిడి.
ఇలా చేయడం ద్వారా బహుళార్థక ప్రయోజనాలు బాబు ఆశించినట్లు తెలుస్తోంది. అయినవాళ్లయినా కూడా బాబుగారు అవినీతిని సహించరన్న పేరు వస్తుంది. ఎప్పటి నుంచో మంత్రి పదవిపై బాలయ్యకు ఆశ వుంది. అది ఇవ్వడం అన్నది బాబుగారికి ఇష్టం లేనిపని. బాలయ్యకు ఇస్తే లోకేష్ కు ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే బాలయ్యను పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ బదనామ్ వ్యవహారంతో మరి బాలయ్య ఆశలు అడుగంటిపోయినట్లే.
ఇప్పుడు ఈ యావత్తు వ్యవహారం బాలయ్యకు బాగానే చికాకు తెప్పించినట్లు వినికిడి. ఎందుకంటే చంద్రబాబు కనుసైగ చేసినా, లేదా ఆయనకు ఇది నచ్చని విషయం అని తెలిసినా అనంతపురం తెలుగుదేశం జనాలు ఈ విషయాన్ని ఇంత రచ్చ చేయవు. అలా రచ్చ చేసాయి అంటే, దాని వెనుక ఏదో దన్ను, ధైర్యం వుండివుండాలి. ఇదే ఇప్పుడు బాలయ్యకు చికాకు కలిగించిన విషయం. వాళ్లు అంత రచ్చ చేసినందునే బాబు నేరుగా కలుగ చేసుకుని, బాలయ్య పిఎ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఇది బాలయ్యకు తల కొట్టినట్లే. అయితే ఈ విషయంలో బాలయ్య నేరుగా బాబుతో డిస్కషన్ కు దిగడం లేదు. కానీ మధ్యవర్తుల దగ్గర తన మనసులో మాట చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య పిఎ, బాలయ్య సన్నిహితుల దందాలపై పూర్తి రిపోర్టు బాబు దగ్గర వుందని తెలిసిన ఈ మధ్యవర్తులు కూడా పెదవి విప్పడం లేదని వినికిడి. మొత్తం మీద తొలిసారి బాలయ్య కు కూడా బావ సంగతి తెలిసి వచ్చినట్లుంది.