బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ వన్ విషయానికొస్తే, హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ అంచనాలకు మించి రాణించాడు. ఎన్టీఆర్ కారణంగానే ఆ షో తెలుగులో అంత పాపులర్ అయ్యిందనడం అతిశయోక్తి కాదు. కానీ, రెండో సీజన్‌కి వచ్చేసరికి ఈక్వేషన్స్ మారిపోయాయి. నాని హోస్ట్‌గా మారాడు. దాంతో చాలామంది ఆశ్చర్యపోయారు. 'స్టార్‌డమ్ ఎక్కడ.?' అని చాలామంది ప్రశ్నించారు. 'సీజన్ 2 తేలిపోయినట్లే..' అని చాలామంది చేతులెత్తేశారు.
'ఇంకొంచెం మసాలా..' అంటూ ఎప్పటికప్పుడు 'షో' మీద హైప్ పెంచేందుకు హోస్ట్‌గా నాని పడ్తున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. హైప్ పెరగడం సంగతేమోగానీ, సీజన్ వన్ విషయంలో లేని వివాదాలు రెండో సీజన్ వచ్చేసరికి పెరిగిపోయాయి. ఆ వివాదాలేవీ పబ్లిసిటీ పరంగా బిగ్ బాస్‌కి హెల్ప్ అవలేదు సరికదా, బిగ్ బాస్ రియాల్టీ షో ఇమేజ్‌ని మరింత దిగజార్చేశాయి. హోస్ట్ నాని సంగతి సరే సరి. సినిమాల్లో సంపాదించుకున్న పేరు కాస్తా, బిగ్ బాస్ కారణంగా పోయే పరిస్థితి ఏర్పడిందన్నది చాలామంది అభిప్రాయం.
రెండో సీజన్ బిగ్ బాస్ విషయానికొస్తే.. అంతా కౌషల్ ఆర్మీ పుణ్యమే. నిజమే మరి, ఓ 'ఆర్మీ' తయారై, కౌషల్‌ని 'ఎలిమినేషన్' నుంచి తప్పించడం మాటెలా వున్నా, ఈ హోరులో కొద్దో గొప్పో పాపులారిటీని బిగ్‌బాస్ రియాల్టీ షోకి అప్పగిస్తున్నారు కౌషల్ అభిమానులు. ఈ క్రమంలోనే అడపా దడపా నాని మీద విమర్శలతో కౌషల్ ఆర్మీ విరుచుకుపడ్తుండడం గమనార్హం. తన మీదా, బిగ్ బాస్ రియాల్టీ షో మీదా వస్తున్న విమర్శలకు అప్పుడప్పుడూ నాని వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.
'బిగ్‌బాస్ నిర్వాహకులు వద్దన్నా సరే.. స్పందించడం నా బాధ్యత..' అంటూ ఇప్పటికే రెండు మూడుసార్లు నాని సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'ఇదే ఆఖరు..' అంటూ తాజా స్పందనలో పేర్కొన్నాడు. అందర్నీ సమాన దృష్టితో చూస్తున్నాననీ, ఎలిమినేషన్ ప్రక్రియలో తనకేమీ సంబంధం లేదని నాని చెప్పుకున్నాడుగానీ.. ఇక్కడితో నాని మీద ట్రాలింగ్ ఆగిపోతుందని అనుకోవడానికి వీల్లేని పరిస్థితి.
మొత్తమ్మీద, 'బిగ్‌బాస్ రియాల్టీ షో' నేచురల్ స్టార్ నానిని బాగా ఇబ్బంది పెట్టేస్తోంది. ఈ రియాల్టీ షో కారణంగానే తాను ఇంటింటికీ ఇంకా బాగా దగ్గరైపోయానని గతంలో జూనియర్ ఎన్టీఆర్ గర్వంగా చెప్పుకుంటే, నాని పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది.
'దేవదాస్' సినిమాని బాయ్ కాట్ చేసెయ్యాలంటూ కౌషల్ ఆర్మీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతోనే నాని ఈసారి ఇంత సీరియస్‌గా, తెలివిగా స్పందించాడని అనుకోవాలేమో.!