ఏ సినిమా అయినా ఫైనాన్స్ లేకుండా పని జరగదు. డబ్బులు ఇబ్బడిగా వున్నా కూడా ఒక్కోసారి ఫైనాన్స్ చూపించాల్సిందే. అలాంటిది బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు అంటే ఫైనాన్స్ తప్పని సరి. తొలి పార్ట్ కు వంద కోట్లకు పైగా ఖర్చు చేసారు. సినిమా ప్రాజెక్ట్ ఆరంభంలో సత్యరంగయ్య లాంటి సినిమా రెగ్యులర్ సినిమా ఫైనాన్షియర్ దగ్గర పాతికో, ముఫై కోట్లో తీసుకున్నారు. అయితే అది సినిమాలకు ఇచ్చే రెగ్యులర్ వడ్డీ. నూటికి మూడు రూపాయిలు.
ఆ తరువాత మీడియా టైకూన్ రామోజీ రావు దగ్గర 60 నుంచి 70 కోట్ల వరకు తీసుకున్నారని వార్తలు వినవచ్చాయి. దీనికి 25 పర్సంట్ వడ్డీ. అంటే నూటికి రెండు రూపాయిలు అన్నమాట. అయితే రెండో భాగానికి మాత్రం రామోజీ రావు దగ్గర ఫైనాన్స్ తీసుకోవలేదట. దీనికి కారణాలు రెండు అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకటి పార్ట్ వన్ విడుదలకు ముందు ఫైనాన్స్ క్లియరింగ్ కోసం రామోజీ సంస్థల నుంచి విపరీతమైన ఒత్తిడి రావడం. దీని వల్ల దర్శకుడు రాఘవేంద్రరావు ఇంటి మనుషులైన నిర్మాతలు చాలా కిందా మీదా పడాల్సి వచ్చిందట. ఇక రెండో కారణం, ఈసారి వంద కోట్లు జస్ట్ 18 పర్సంట్ అంటే రూపాయిన్నర వడ్డీకి దొరకడం. వంద కోట్లు రూపాయిన్నర వడ్డీకి అది కూడా సినిమా వాళ్లకి దొరకడం అంటే ఎగిరిగంతేసేంత విషయం. ఇలా ఇంత తక్కవ వడ్డీకి అంత భారీ మొత్తం ఇచ్చింది మరెవరో కాదు, నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, వైఎస్ జగన్, ఆ మాటకు వస్తే ఒకప్పుడు చంద్రబాబుకు ఇలా ప్రతి ఒక్కరికి అత్యంత సన్నిహితుడైన మాట్రిక్స్ ప్రసాద్ నే.
ఆయనే ఈసారి బాహుబలి పార్ట్ 2కు వందకోట్లు రూపాయిన్నర ధర్మ వడ్డీకి ఫైనాన్స్ చేసారట. బ్యాంకులు కూడా ఇంత తక్కువ మొత్తానికి రుణాలివ్వవు. అందుకే బాహుబలి 2 ఫంక్షన్ లో బాహుబలి టీమ్ ఆయనకు కూడా సముచిత గౌరవం అందించింది.