ఓ సినిమా హిట్ అయితే డైరక్టర్ కు పేరు రావడం సహజం. ఓ కలలాంటి కథను తెరకెక్కిస్తే అంతకన్నా ఎక్కువ పేరే వస్తుంది. రాజమౌళికి వచ్చింది అదే. ఓ ఊహకు వెండి తెర రూపం కల్పించారు ఆయన. అందుకు తగ్గ ప్రశంసలు, పేరు రెండూ వచ్చాయి. కానీ అలా అని చెప్పి, రాజధాని భవనాల డిజైన్ కు ఆయనను సంప్రదించాలి అనుకోవడం అత్యంత హాస్యాస్పదం. అంతకన్నా హీనమైన విషయం మరోటి వుండదు.
ఏళ్ల తరబడి ఆర్కిటెక్చర్ చదువుని, నిపుణత సాధిస్తారు కొందరు. వాళ్ల చేతే డిజైన్ చేయించుకుంటారు భవనాలకు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా హైదరాబాద్ లో నిర్మించిన భారీ భవనానికి కూడా ఇలాగే ఓ ఆర్కిటెక్ట్ నే డిజైన్ చేసి వుంటారు. అంతేకానీ సినిమా డైరక్టర్ కాదు. యాదగరి అభివృద్దికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సినిమా కళా దర్శకుడిని సలహా దారునిగా పెట్టుకున్నారు. ఎందుకంటే అతను ఆర్ట్ డైరక్టర్ కాబట్టి. రేపు భవిష్యత్ లో రాజమౌళి భారీ బంగ్లా నిర్మించుకోవచ్చు. దానికి ఆయన డిజైన్ వేసుకోరు. ఎవరో ఒక ఆర్కిటెక్ట్ నే పట్టుకుని, తనుకు ఇలా కావాలి అని అడిగి చేయించుకుంటారు.
కానీ రాజమౌళి ఎవరు? అసలు బాహుబలి సినిమాలో మాయిష్మతికి ప్రాణం పోసింది ఎవరు? మాయిష్మతి అనేది ఓ కలల సామ్రాజ్యం. ఆ కలను రాజమౌళి విపులంగా చెబితే, పదుల సంఖ్యలో ఆర్టిస్ట్ లు స్కెచ్ లు వేసారు. సిబు సొరిల్ లాంటి విజువల్ గ్రాఫిక్స్ నిపుణుడు వాటిని పర్యవేక్షించారు. అప్పుడు వాటిని నిపుణులైన గ్రాఫిక్స్ ఇంజనీర్లు తెరపైకి తెచ్చారు. ఈ ప్రాసెస్ లో రాజమౌళి చేసింది, ఆ చేస్తున్న పని తన కలకు అనుగుణంగా వస్తోందా లేదా అన్నదే.
నిజానికి చంద్రబాబు కావాలనుకుంటే, బాహుబలికి స్కెచ్ లు గీసిన చిత్రకారులను తీసుకెళ్లి, రకరకాల స్కెచ్ లు గీయించవచ్చు. తప్పులేదు. అంతే కానీ రాజమౌళి ముందుకు తీసుకువెళ్లి మంత్రులను, అధికారులను కూర్చో పెట్టడం ఏమిటి? ఏమన్నా అర్థంవుందా? ఇది ఆర్కిటెక్ట్ లను అవమానించడం కాదా?
ఏం చేస్తాం, ఇది తప్పు, సరికాదు అని చెప్పాల్సిన మీడియా చెప్పదు. పైగా రాజమౌళి ఫొటోలో వున్నాడు, వార్తలో వున్నాడు అనగానే, సినిమాలు అంటే పడి ప్రాణాలిచ్చేసే రీడర్లు వున్నారు కాబట్టి, వెంటనే వార్తగా అందించేస్తారు. అంతే కానీ, ప్రభుత్వానికి ఇది సరికాదు అని చెప్పరు. జనాలు కూడా ' రాజమౌళి డిజైన్ చేస్తనాడంట్రా రాజధానికి' అని కథలు కథలుగా చెప్పుకుంటారు. నిపుణులైన ఆర్కిటెక్ట్ లు ఈ వ్యవహారం అంతాచూసి, తమలో తాము నవ్వుకుని, నిట్టూరిస్తారు. అంతే.