తమ సినిమా పబ్లిసిటీ కోసం… ఎన్ని రకాలైన ఎత్తుడలైనా వేస్తారు సినిమాల వాళ్లు. విడుదలకు ముందు దాని హైప్ ను పెంచడానికి వీళ్లు తమ బుర్రలకు పదును పెడుతూ ఉంటారు. ఈ ప్రయత్నాల్లో సినిమా వాళ్లు వేసే ఎత్తులపై ప్రేక్షకులకందరికీ క్లారిటీ ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలో బాలయ్య తాజా సినిమా “డిక్టేటర్'' విషయంలో కొన్ని ఆసక్తికరమైన అనుమానాలు వస్తున్నాయి. ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషల హీరోలు ముందుకొస్తున్నారనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
ముందుగా అజయ్ దేవగణ్ ఓకే చేశాడని, ఇప్పడు అజిత్ ఓకే చేశాడని లీకులు వదిలారు. ఈ సినిమాను ఇప్పటికే ఆ హీరోల ప్రతినిధులు చూసేశారని.. రీమేక్ చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారని.. హిందీలో అజయ్ దేవగణ్, తమిళంలో అజిత్ లు హీరో లుగా నటించబోయే తర్వాతి సినిమాలు 'డిక్టేటర్' కు రీమేకే.. అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఏ హీరో అయినా… ఒక సినిమా హిట్ అయ్యిందంటేనే రీమేక్ లకు ముందుకొస్తారు. విడుదలకు ముందే రీమేక్ లకు కమిట్ కావడం దాదాపుగా ఎవరూ చేయరు!
అయితే బాలయ్య సినిమా విషయంలో మాత్రం ఈ లీకులుచ్చేశారు. మరి ఇదంతా తమ సినిమాపై హైప్ ను పెంచుకునే ప్రయత్నమేనని.. విడుదలకు ముందే సినిమాను రీమేక్ చేయడానికి చాలామంది హీరోలు రెడీ అవుతున్నారని ప్రచారం చేసుకుంటే.. జనాల్లో దీనిపై ఆసక్తి పెరుగుతుందనేది 'డిక్టేటర్' రూపకర్తల వ్యూహం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అజిత్ , అజయ్ దేవగణ్ ల పేరుతో 'డిక్టేటర్' పై హైప్ ను పెంచే యత్నం చేస్తున్నారని అంటున్నారు. మరి అసలు కథ ఏమిటో.. 'డిక్టేటర్' విడుదలయ్యాకా కానీ క్లారిటీ రాదు!