ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. కేఎస్ రవికుమార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడే అంతా ఈ కాంబినేషన్ కొత్తగా ఉందని ఫీల్ అయ్యారు. కేవలం కాంబినేషన్ మాత్రమే కాదు, కథ కూడా కొత్తగా ఉంటుందట.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. బాలయ్య ఇందులో 'పెళ్లి కాని ప్రసాద్' పాత్రలో కనిపించబోతున్నాడట. 40ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోతాడట. దానికి కారణం ఏంటనేది ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారట. ప్రేమించిన నయనతార వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో బాలయ్య భగ్న ప్రేమికుడిగా మారతాడట. అయితే సినిమా సెకెండాఫ్ లో నయనతార మళ్లీ రావడంతో కథ రసకందాయంలో పడుతుంది.
బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమాపై వినిపిస్తున్న స్టోరీలైన్ ఇదే. బాలయ్య ఎందుకు బ్యాచిలర్ గా ఉండిపోయాడనే విషయాన్ని బయటపెట్టే బాధ్యతకు కొత్త హీరోయిన్ నటాషా దోషికి అప్పగించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.