హీరో అఖిల్ నిశ్చితార్థం డేట్ దగ్గరకు వస్తోంది. నాగార్జున ఈ ఫంక్షన్ హడావుడిలో బిజీగా వున్నారు. పొలిటికల్, బిజినెస్, మూవీ రంగానికి చెందిన టాప్ సెలబ్రిటీలు ఈ ఫంక్షన్ హాజరవుతారు. ఈ మేరకు చాలా సెలక్టివ్ గా నాగ్ ఆహ్వానాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫొటోలు మీడియాలో హల్ చల్ చేసాయి.
అయితే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా నాగ్ చాలా సైలెంట్ గా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నాయుడుని నాగ్, అఖిల్ ఇద్దరు వెళ్లి కలిసి, ఇన్విటేషన్ అందించినట్లు తెలుస్తోంది. ఇది జరిగి కొద్ది రోజులే అయింది. అదే రోజు రాజుగారి గది 2 ఓపెనింగ్ కూడా అయింది. అయితే మీడియాలో మాత్రం ఎక్కడా ఫొటోలు లేవు, వార్తలు లేవు.
ఇదిలా వుంటే హీరో బాలకృష్ణతో నాగ్ కు తెలియని విబేధాలున్నాయని గుసగుసలు వున్నాయి. వాటికి మరింత బలం చేకూర్చేలా, అఖిల్ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు బాలయ్యకు ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ను ఆహ్వానం అందిందో లేదో మాత్రం తెలియదు.