సినిమా రంగంలో స్నేహాలు చిరకాలం మనజాలడం కష్టం. ఎందుకంటే సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేగా. మొన్నటికి మొన్న టెంపర్ వరకు ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకున్న నిర్మాత బండ్ల గణేష్, హీరో సచిన్ జోషి ఇప్పుడు వేరయినట్లు కనిపిస్తోంది. సచిన్ కు చెందినది గా భావిస్తున్న వైకింగ్ మీడియా సంస్థ లీగల్ నోటీసులు ఇచ్చింది. బండ్ల ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, తమకు బకాయిలు చెల్లించలేదన్నది, సినిమా నిర్మాణంలో పేరు వేయలేదన్నది అభియోగం.
సచిన్ జోషి నటించిన నీ జతగా నేనుండాలి కి బండ్ల గణేష్ నిర్మాత అని బయటకు తెలిసిన సంగతి. సచిన్ తన డబ్బులతో బండ్ల చేత సినిమా తీయించాడన్నది ఊహాగానాలు. అయితే తెరవెనుక ఇంతకు మించి ఏదో వుందని ఇప్పుడు ఈ నోటీసులు చెబుతున్నాయి. సచిన్ డబ్బులు ఇచ్చి, సినిమా తీయించి వుంటే బండ్ల తిరిగి ఎందకు ఇవ్వాల్సి వుంటుంది? టెంపర్ కు సచిన్ ఫైనాన్స్ చేసాడని వార్తలు వినవచ్చాయి. దాని బాపతు నోటీసులా ఇవి అన్నది అనుమానం.
టాలీవుడ్ వర్గాల్లో ప్రచారంలో వున్నదాని ప్రకారం నీజతగా నేనుండాలి సినిమాకు అంతగా కలెక్షన్లు రాలేదని, అయినా కూడా వీటి లెక్కలు బండ్ల గణేష్ తేల్చకపోవడం వల్లనే, తన దగ్గర ముందు జాగ్రత్తగా వుంచుకున్న చెక్కులతో వైకింగ్ సంస్థ కేసు వేసిందని తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి.