భయం వేరు భక్తి వేరు

దాసరికి అన్యాయం జరిగింది.. దాసరికి అన్యాయం జరిగింది. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. నివాళులు అర్పించడానికి హీరోలు రాలేదు. దాసరి వల్ల ఉపయోగాలు పొందినవారు రాలేదు. దాసరి చుట్టూ తిరిగినవారు రాలేదు. ఇదీ టాక్.…

దాసరికి అన్యాయం జరిగింది.. దాసరికి అన్యాయం జరిగింది. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. నివాళులు అర్పించడానికి హీరోలు రాలేదు. దాసరి వల్ల ఉపయోగాలు పొందినవారు రాలేదు. దాసరి చుట్టూ తిరిగినవారు రాలేదు. ఇదీ టాక్. నిజమే.

కానీ ఇదేమీ టాలీవుడ్ కు కొత్తకాదు కదా? టాలీవుడ్ లో అన్నీ డబ్బు చుట్టూ తిరుగుతాయి. టాలీవుడ్ చాలా వరకు కులం చుట్టూ తిరుగుతాయి. టాలీవుడ్ లో చాలా వరకు సక్సెస్ చుట్టూ తిరుగుతాయి. ఇంకా చెప్పాలంటే అవసరం చుట్టూ తిరుగుతాయి.

ఎంతోమంది మహాను భావులు టాలీవుడ్ ను వదిలి పైకి వెళ్లిపోయారు. వాళ్లందరికీ సమగౌరవం దక్కిందా? అంటే అనుమానమే. కొందరికి ఒకరకం గౌరవం. మరి కొందరికి ఇంకోరకం. మరి కొందరికి అసలు ఏమీలేదు. కారణం, ఈ కులాలు, డబ్బు, అవసరం, సక్సెస్ ఇలాంటివి చాలా వున్నాయి.

ఇక దాసరి విషయానికి వస్తే, ఇండస్ట్రీ జనాలకు ఆయన మీద భక్తి కన్నా, అవసరం ఎక్కువ వుండేది అనిపిస్తుంది. ఆయన మీద భక్తి కన్నా భయమే అధికం అనిపిస్తుంది. ఆయనను ఇండస్ట్రీలో ఓ వర్గానికి ప్రతినిధిగా చూసారు. రాజకీయాల్లో ఓ వర్గానికి ప్రతినిధిగా చూసారు. పెద్దమనిషి అంటూ ఎవరో ఒకరు వుండాలి ఎప్పుడూ. సమస్యలు తీర్చడానికి. ఆ విధంగా దాసరిని చూసారు కానీ, అభిమానంతో ఆయన దగ్గరకు వెళ్లలేదు.

అంతకు ముందు పుట్టిన రోజుకు, ఈసారి పుట్టిన రోజు సమయంలో ఓ నిర్మాత ఇలా అన్నాడు.. 'దాసరి గారి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది.. పుట్టిన రోజుకు వచ్చి, సార్ ను అభినందించి వెళ్లండి' అని. ఇలా చెబుతూ, ఇదేం మొహమాటం అండీ అన్నాడు సదరు నిర్మాత. అంటే అక్కడే అర్థం అయిపోవడం లేదూ. దాసరి అంటే మొహమాటం, భయం తప్ప, భక్తి లేదని.

భయం అనేది మనిషి వున్నంత కాలమే వుంటుంది. భక్తి అనేది ఆకారం లేకపోయినా వుంటుంది. దాసరి విషయంలో జరిగింది అదే. అన్ని క్రాఫ్ట్స్ సంఘాల విషయంలోనూ దాసరికి పట్టు వుండేది. ఆయనతో పెట్టుకుంటే ఏమవుతుందో అన్న భయం వుండేది. మనిషి ఎప్పుడైతే లేరో, అదికాస్తా పోయింది. వ్యాపార ప్రపంచం ఇలాగే వుంటుంది. ఇక్కడ విశ్వాసాలు, కృతజ్ఞతలు వుండవు. అవసరాలు, వ్యాపారాలు, లావాదేవీలే వుంటాయి.