సౌత్ అంటే ఇష్టం.. సినిమా మాత్రం కష్టం

ఉన్నట్టుండి హఠాత్తుగా బోనీ కపూర్ నుంచి ప్రకటన వచ్చింది. ఏదో రీమేక్ కోసమో, నిర్మాణం కోసమో కాదు. తన కూతురుపై వస్తున్న రూమర్లపై స్పష్టత ఇచ్చేందుకు బోనీ కపూర్ స్వయంగా ప్రెస్ నోట్ రిలీజ్…

ఉన్నట్టుండి హఠాత్తుగా బోనీ కపూర్ నుంచి ప్రకటన వచ్చింది. ఏదో రీమేక్ కోసమో, నిర్మాణం కోసమో కాదు. తన కూతురుపై వస్తున్న రూమర్లపై స్పష్టత ఇచ్చేందుకు బోనీ కపూర్ స్వయంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. జాన్వికి సౌత్ సినిమాలంటే చాలా ఇష్టమన్నారు. శ్రీదేవి సౌత్ లో చాలా సినిమాలు చేసిందని చెప్పుకొచ్చారు. కృష్ణ, చిరంజీవితో సత్సబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. టోటల్ గా తమ కుటుంబానికే సౌత్ అంటే చాలా ఇష్టమని ప్రకటించారు. ఫైనల్ గా జాన్వి మాత్రం సౌత్ లో సినిమాలు చేయడం లేదని స్పష్టంచేశారు. 

సౌత్ బడా స్టార్స్ నుంచి వస్తున్న ఆఫర్లను వరుసగా తిరస్కరిస్తూ వస్తోంది జాన్వి కపూర్. గతంలో చరణ్, మహేష్ లాంటి హీరోల సినిమాల్లో ఆమెను తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. తాజాగా వచ్చిన మరో రెండు సినిమా ఆఫర్లను కూడా ఆమె తిరస్కరించిందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. జాన్వికి సౌత్ అంటే ఇష్టంలేదంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే బోనీకపూర్ ఇలా ప్రెస్ రిలీజ్ వదిలారు. 

అంతా బాగానే ఉంది కానీ, ఈ ప్రెస్ నోట్ లోనే పరోక్షంగా మరో క్లారిటీ కూడా ఇచ్చాడు బోనీ. పూరి జగన్నాద్, విజయ్ దేవరకొండ సినిమాలో జాన్విని హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నించారు. ఇప్పుడా ప్రాజెక్టులో కూడా జాన్వి ఉండబోదని పరోక్షంగా స్పష్టంచేశాడు బోనీ. 

జాన్వికి సౌత్ లో నటించాలని ఉందని, కానీ మంచి స్క్రిప్ట్ దొరకడం లేదంటున్నాడు బోనీ. అవకాశాల కోసం చాలా ఎదురుచూశామని, కానీ దురదృష్టవశాత్తూ ఏ ఒక్క ప్రాజెక్ట్ సాకారం కాలేదని బాధపడుతున్నాడు. ఇతడి వరస చూస్తుంటే.. జాన్వి ఇప్పట్లో సౌత్ లోకి వచ్చేలా లేదు.