బోయపాటి డిజాస్టర్ ఇచ్చి, తనేంటో చూపించాలన్న ఆవేశంలో వున్నారు. బాలయ్య బాబు అంచనాలు తప్పిన ఆవేదనలో వున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాల్సి వుంది. మరోపక్క ఎన్టీఆర్ బయోపిక్ కు అయిన ఖర్చెంత, ఆదాయం ఎంత? లావాలేదేవీలు ఏమేమి బాకీ వున్నాయి తదితర లెక్కలు తేలాల్సి వుంది. ఇవన్నీ ఇలా వుంచితే ఎన్నికల తరుణం వచ్చేసింది. బాలయ్య క్షణం ఖాళీగా వుండే పరిస్థితిలేదు.
ఇలాంటి నేపథ్యంలో బాలయ్య-బోయపాటి సినిమా ప్రారంభం కాదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మహా అయితే ముహుర్తం చేస్తే చేస్తారు తప్ప, సినిమా అయితే మరో మూడునెలల వరకు స్టార్ట్ కాదు అని తెలుస్తోంది. అసలు సినిమా నిర్మాణం కొనసాగించాలా? వద్దా? ప్రాజెక్టును తనే చేస్తే ఓకె. లేదూ వేరేవాళ్లకు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఇలాంటివి అన్నీ ఇంకా మొగ్గ దశలోనే వున్నాయని తెలుస్తోంది.
ఈ లెక్కన చూస్తుంటే 2019లో మళ్లీ బోయపాటి సినిమా చూసే అవకాశం తక్కువే అనుకోవాలి. అలా అని వేరే హీరో దగ్గరకు వెళ్లే పరిస్థితి కూడా బోయపాటికి లేదు. హీరోలు ఖాళీ లేరు. డేట్ లు ఇచ్చే అవకాశమూ లేదు. అందువల్ల బాలయ్య ఓకె అనే వరుకు వేచి వుండాల్సిందే.