ఓ కమెడియన్ ఎంత రేంజ్ కు వెళ్లగలడో అంత స్థాయికి చేరుకున్నాడు. తొలిసారి రోజుల లెక్క, పూటల లెక్క పారితోషికం తీసుకునే పద్దతి బ్రహ్మీతో ప్రారంభమైంది. రోజకు అయిదులక్షలు, కేరవాన్ వగైరా అదనం అనేంతగా వుంది బ్రహ్లీ లెవెల్. ఒక విధంగా చెప్పాలంటే హీరో స్టేటస్ అనుభవించాడు. హీరోలతో సమానమైన పాత్ర, సినిమాను తన భుజంపై మోసే పాత్రలు, పాటలు ఇలా ఎక్కడికో వెళ్లాడు.
కానీ ఇప్పుడు రాను రాను బ్రహ్మీ సినిమాలు తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. కొత్త కొత్త కమెడియన్లు రావడం, బ్రహ్మీ రేటు చిన్న మధ్య తరగతి సినిమాలకు అందుబాటులో లేకపోవడం వంటివి కొన్ని కారణాలు. పైగా కొందరు రైటర్లే బహ్మీకి తగిన క్యారెక్టర్లు తయారు చేయగలుగుతున్నారు. మిగిలిన వారి పాత్రల్లో బ్రహ్మీ చేసినా కూడా పెద్దగా బాగుండడంలేదు. బ్రహ్మీ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, కొన్ని భారీ తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేసినపుడు ఆయనతో రీ షూట్ చేసారు. కానీ అవి దారుణంగా విఫలమయ్యాయి. అంటే బ్రహ్మీ పాత్రల వెనుక ఆయన కృషి ఎంత వుందో, రచయితల కృషి కూడా అంతకు అంతా వుంది.
కానీ అందరు రచయితలకు ఇది సాధ్యం కావడం లేదు. కోనవెంకట్ అండ్ కో కి మాత్రమే సాధ్యం అవుతోంది. దాంతో మిగిలిన వారు బ్రహ్మీకి దూరంగా వుంటున్నారు. ఇప్పుడు కోన వెంకట్ అండ్ కో కూడా తమ డిక్టేటర్ సినిమాకు బ్రహ్మీని దూరంగా వుంచారు. ఈ సినిమాకు దర్శకుడు శ్రీవాస్ నే నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడంతో, ఖర్చు కంట్రోలు చేసుకోవడానికి బ్రహ్మీకి బదులు అదే పాత్రకు పృధ్వీని తీసుకున్నారు. ఇక్కడ మరోసారి పృధ్వీ చెలరేగిపోతే, ఆ క్యాంప్ కు కూడా బ్రహ్మీ దూరం అవుతాడు.
ఇప్పుడు శ్రీమంతుడు లాంటి భారీ సినిమాలో కూడా బ్రహ్మీ లేడు. అయితే బ్రహ్మీ ఇప్పటికే చాలా శిఖరాలు అధిరోహించాడు. షష్టి పూర్తి వేళకు ఎనిమిది వందల సినిమాల్లో నటించి, గిన్నెస్ బుక్ కు ఎక్కేసారు. తాను చేయని పాత్ర లేదు అనిపించారు. కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు తగ్గడం సహజమే.