నటుడు బ్రహ్మానందం కెరీర్ ఇప్పుడంత జూమ్ లో లేదనే చెప్పాలి. సరైన హిట్స్ లేకపోవడం, హిట్ సినిమాల్లో బ్రహ్మానందం క్యారెక్టర్ పండకపోవడంతో ‘దూకుడు’ అంతటి దూకుడు ఇప్పుడు లేదు. కమల్ హాసన్ తో నటిస్తున్న సినిమా వంటి వాటిపై ఆశలు పెట్టుకుని ఉన్నా.. ఆ సినిమాలు వెనక్కెనక్కే వెళ్తున్నాయి.
అయితే మళ్లీ దూసుకొచ్చే సత్తా బ్రహ్మానందానికి ఉంది. మరి ఈ సంగతిలా ఉంటే.. బ్రహ్మానందం ఆస్తుల విలువపై చర్చకు తెరలేపింది ఒక ఆంగ్ల మీడియా. దక్షిణాది కేంద్రంగానే నడించే ఆ ఇంగ్లిష్ మీడియా వర్గం బ్రహ్మీ ఆస్తుల విలువ గురించి భారీ నంబర్ నే చెబుతోంది.
దాని అంచనా ప్రకారం బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ.320 కోట్ల పైనే! బ్రహ్మానందం స్థిర, చరాస్తుల విలువ ఈ మాత్రం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. జూబ్లీ హిల్స్ లో బ్రహ్మానందానికి భారీ భవంతి ఒకటి ఉందని, అలాగే ఫార్మ్ హౌస్ విలువతో కలుపుకుంటే ఆయన ఆస్తులు అలవోకగా మూడొందల కోట్ల రూపాయల విలువను దాటతాయని ఆ సంస్థ చెబుతోంది.
ఇక ఆయన దగ్గర ఖరీదైన కార్లున్నాయని ఆడీ ఆర్8, ఆడీ క్యూ7, మెర్సిడేజ్ బెంజ్ బ్లాక్ వంటి కార్లున్నాయని చెప్పుకొచ్చింది. అటు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ కూడా బ్రహ్మానందం భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టాడని పేర్కొంది. మరి 320 కోట్ల రూపాయల ఆస్తులు అంటే ఇది భారీ మొత్తమే అని చెప్పాలి.
ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ నటీనటులు కూడా దిక్కూదివాణం లేకుండా పోయిన సందర్భాలున్నాయి. అయితే మనీ మేనేజ్ మెంట్ స్కిల్స్ తో వందల కోట్లు సంపాదించిన వాళ్లూ ఉన్నారు. బ్రహ్మానందం రెండో కోవకు చెందిన వారని అనుకోవాలి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బ్రహ్మానందం సినిమాకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట!