బాలీవుడ్ లో 'మీ-టూ' ఉద్యమం ఊపందుకుంది. ఒక్కొక్కరుగా తమకు జరిగిన కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాల్ని బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నానా పటేకర్ పై తనుశ్రీ దత్తా అభియోగాలు చేసింది. కంగనా రనౌత్ దర్శకుడు వికాస్ బాల్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో దర్శకుడు కూడా చేరాడు. అతడే సాజిద్ ఖాన్.
గతంలో హే బేబీ, హిమ్మత్ వాలా, హమ్ షకల్స్ లాంటి సినిమాలు తీసిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా హౌజ్ ఫుల్-4 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70శాతం పూర్తయింది. ఇంతలోనే ఇతడిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడంతో, తనవంతు బాధ్యతగా సినిమాను పక్కనపెట్టాడు అక్షయ్ కుమార్.
ఏకంగా ముగ్గురు మహిళలు సాజిద్ ఖాన్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. నటి రాచెల్ వైట్, అసిస్టెంట్ డైరక్టర్ సలోనీ చోప్రా, జర్నలిస్ట్ కరిష్మా ఉపాధ్యాయ ఒకేసారి సాదిద్ పై విరుచుకుపడ్డారు. హమ్-షకల్స్ సినిమా ఆడిషన్స్ కోసం సంప్రదిస్తే, అసభ్యంగా ప్రవర్తించాడంటూ రాచెల్ ఆరోపిస్తే.. లైంగికంగా వేధించాడంటూ జర్నలిస్ట్ కరిష్మా విమర్శలు చేసింది.
ఇక అసిస్టెంట్ డైరక్టర్ సలోనీ అయితే ఎవరూ ఊహించని విధంగా సాజిద్, తన ప్యాంట్ కిందకి లాగేశాడని ఆరోపించింది. మొన్నటివరకు ఇటలీలో తనకు ఈ విషయాలేవీ తెలియవని అంటున్నాడు అక్షయ్ కుమార్. ఇండియాకు వచ్చిన వెంటనే కాస్టింగ్ కౌచ్ ఆరోపణల గురించి తెలిసిందని, అందుకే వెంటనే సినిమా షూటింగ్ ఆపేస్తున్నానని ట్విట్టర్ లో ప్రకటించాడు.
ఈ ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిగి దోషులెవరో తేలేవరకు తను సినిమా సెట్స్ పైకి రానని, సాజిద్ తో కలిసి పనిచేయనని ప్రకటించాడు. ఈ 28 ఏళ్లలో ఒక్కసారి కూడా షూటింగ్ కాన్సిల్ చేయలేదు అక్షయ్ కుమార్. తొలిసారిగా ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణల వల్ల అక్షయ్ కుమార్ సినిమా ఆగిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సినిమాలు ఇలా ఆగిపోతాయో!