ఒకప్పుడు హీరోయిన్ గా ఓ మోస్తరుగా వెలిగిన మధుబాల, ఇప్పుడు తల్లి పాత్రల్లో కన్పిస్తోంది తెలుగు తెరపై. అదీ చాలా సెలక్టివ్‌గానే. చాలాకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాలో కన్పించింది మధుబాల. ప్రస్తుతం ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అడపా దడపా బాలీవుడ్ పార్టీల్లో దర్శనమిచ్చే మధుబాలకి అవకాశాలు బాగానే వస్తున్నా, అన్ని ఆఫర్లనూ ఓకే చెయ్యడంలేదట. అందుకే అడపా దడపా మాత్రమే ఆమె తెరపై కన్పిస్తోందట. సెలక్టివ్‌గానే సినిమాలు చేయాలనుకున్నా.. కథ నచ్చితేనే సినిమా చేస్తా.. రెమ్యునరేషన్‌కి లొంగి సినిమాలు చేయను.. అనేస్తోంది మధుబాల.
‘హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నాను.. దాన్ని చెడగొట్టుకోలేను. సీనియర్ నటిగా, నా అనుభవం సినిమాకి ఉపయోగపడాలనుకుంటాను. అలాగే నా ఇమేజ్ పడిపోకుండా వుండేలా మంచి పాత్రల్ని ఎంచుకోవడం నా బాధ్యత..’ అంటున్న మధుబాల, కథ నచ్చితే రెమ్యునరేషన్ గురించి ఆలోచించనని చెబుతోంది.