ఆయన విజయవంతమైన చిత్రాల కధకుడు. ఎన్నో చిత్రాలకు కధలు అందించినా, ఇటీవలి కాలంలో ఆయన పేరు దేశం… కాదు కాదు ప్రపంచమంతా మారుమోగిపోయింది. బాహుబలి, భజరంగి భాయీజాన్ సినిమాల కధా రచయిత విజయేంద్రప్రసాద్… చిరంజీవి 150 వ సినిమాకు కధ అంటే కంగారు పడిపోతున్నాడా? తన వల్ల కాదంటున్నాడా?
గత కొన్ని రోజులుగా చిరంజీవి 150 వ సినిమాకు కధను అందించేందుకు విజయేంద్రప్రసాద్‌ను సంప్రదించారని, మెగా క్యాంప్ ఆయనతో మాట్లాడే పనిలో బిజీగా ఉందని వార్తలు వస్తున్న నేపధ్యంలో విజయేంద్ర… స్పందించారు. దీని ద్వారా తాను చిరంజీవి సినిమాకి కధ రాయడం లేదని ఆయన దాదాపుగా స్పష్టం చేశారు.
దీనికి కారణం చెబుతూ… చిరంజీవికి ఉన్న అసంఖ్యాక అభిమానుల్ని, వారి ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుని కధ రాయల్సి ఉంటుందని, ఇది చాలా కష్టతరమైన విషయమని అన్నారాయన. ఆ అంచనాలను అందుకోవడం తనకు కష్టమైన పని అన్నారు. రామ్ చరణ్‌కి, లేదా అల్లు అర్జున్‌కి రాయడం అంటే సరే కాని చిరంజీవికి మాత్రం తన వల్ల కాదేమోననే సందేహం వ్యక్తం చేశారు.
చిరంజీవి సినిమాకు కధ అంటే… అది దాదాపు 3 బాహుబలి లాంటి సినిమాలకు, 3 భజరంగి భాయీజాన్‌లకు సమానమైనంత, ధీటైనది కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా ఈ సినిమాను కూడా ఆ రెండు సినిమాలతో పోలుస్తారని అది తనకు నచ్చని విషయం అన్నారు. ఇప్పుడు చిరంజీవికి కధ రాయాలంటే ఆయన చేసిన 149 సినిమాలూ కాకుండా అంతకు మించిన సరికొత్త కధ అల్లాల్సి ఉంటుందంటున్న విజయేంద్ర… అయితే ఆ సినిమాకి రాయడం అనేది ఏ రచయితకైనా గొప్ప అవకాశమేనని అంగీకరించారు.