'జ్యోతిలక్మి' సినిమా వరకూ చాలా కలివిడిగా కనిపించిన పూరి జగన్నాథ్, చార్మిల మధ్య.. ఆ తర్వాత తీవ్రమైన విబేధాలు చెలరేగాయి. ఒక దశలో పూరీ తన 'కేవ్' వైపు చార్మిని రానివ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేశాడు. మరి సినిమా వాళ్ల గొడవలు తాటాకు మంటల్లాగానే కనిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చార్మి బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
పూరీ దర్శకత్వంలో రూపొందుతున్న కన్నడ సినిమాకు, అలాగే 'రోగ్' కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతలు చార్మివేనట! ఆ సినిమాలను తెరకెక్కించడం గురించి ప్రణాళికలు రచించడం, అందరినీ సమన్వయం చేసుకోవడం, షూటింగ్ స్పాట్లో దగ్గరుండి అన్నింటినీ చూసుకోవడం… వంటి బాధ్యతలన్నీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వే.
సినీ నిర్మాణంలో ఈ బాధ్యతలు కీలకమైనవే. అలాంటి కీలకమైన బాధ్యతలను పూరీ ఇప్పుడు చార్మికి అప్పగించాడని వినికిడి. మరి ఇది వరకూ పూరీ దర్శకత్వంలో తను ప్రధాన పాత్రలో నటించిన సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించి చార్మి ఇప్పుడు పూరీ కోసమే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కొత్త పాత్రకు సిద్ధం అయ్యింది. మరి ఈ సారి వీరి సఖ్యతలో ఎలాంటి సినిమాలు వస్తాయో!