ఎక్కడో ఏదో జరిగితే మరెక్కడో ఏదో ప్రభావితం అవుతుందన్నది ఓ సిద్దాంతం. డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ పరిస్థితి అలాగే వుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ లు ఇచ్చిన తరువాత నేల టికెట్ సినిమాతో క్రెడిట్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోయింది. మళ్లీ మొదటికి వచ్చింది వ్యవహారం. అయితే హీరో నాగ్ తను ఇచ్చినమాట మీద వుంటానడంతో కళ్యాణ్ కృష్ణ కెరీర్ కు కాస్త ఊతం లభించింది.
నాగ్ విని ఓకె అన్న పాయింట్ తో స్క్రిప్ట్ తయారుచేయడం మొదలుపెట్టాడు కూడా. అక్టోబర్ నుంచి సినిమా మొదలుపెట్టే అవకాశం వుందని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు సమస్య వేరే వైపు నుంచి వచ్చింది. చిలసౌ ట్రయిలర్, సినిమా చూసిన దగ్గర నుంచి నాగ్ మనసు మారిపోయినట్లు తెలుస్తోంది. ఆ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఓ ఫీల్ గుడ్ అయిడియా కూడా అంతకన్నా నచ్చేసినట్లు వినికిడి.
దాంతో దేవ్ దాస్ తరువాత అక్టోబర్ నుంచి ఏ సినిమా చేయాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసేసాడు. చి.ల.సౌ విడుదల తరువాత జనాల రెస్పాన్స్, సినిమా విజయం చూసి అప్పుడు డిసైడ్ అవుతాడట. రాహుల్ రవీంద్రన్ తో సినిమానా? కళ్యాణ్ కృష్ణ సినిమానా? ఏది ముందు? అన్నది ఆగస్టు మూడు తరువాత డిసైడ్ అవుతుందన్నమాట.
చిలసౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కే ఫస్ట్ చాన్స్ దొరికేలా వుంది. ఎందుకంటే చిలసౌ ట్రయిలర్ చాలా ఆకట్టుకునేలా వుంది. టేకింగ్ తాజాగా వుంది. నాగ్ కూడా ఈ కొత్తదనాన్నే కోరుకుంటాడు కాబట్టి, పైగా రాహుల్ రవీంద్రన్ కూడా సమంతకు ఫ్యామిలీ స్నేహితుడు కాబట్టి, చాన్స్ అటే వుండొచ్చేమో?