చిరంజీవి స్టెప్పులు అదిరిపోతున్నాయట

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ సినిమా కోసం ఇప్పటికే ఓ ఐటమ్‌ సాంగ్‌ని షూట్‌ చేశారు. దానికి సంబంధించిన స్టిల్స్‌ విడుదలయ్యాయి కూడా. ఐటమ్‌…

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ సినిమా కోసం ఇప్పటికే ఓ ఐటమ్‌ సాంగ్‌ని షూట్‌ చేశారు. దానికి సంబంధించిన స్టిల్స్‌ విడుదలయ్యాయి కూడా. ఐటమ్‌ సాంగ్‌లో చిందేసిన లక్ష్మీరాయ్‌, మెగాస్టార్‌తో మెగా మూమెంట్స్‌ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. అందులో డాన్సింగ్‌ స్టిల్స్‌ ఏమీ లేవనుకోండి.. అది వేరే విషయం. లక్ష్మీరాయ్‌ చెబుతున్నదాన్ని బట్టి చిరంజీవి, డాన్సులు ఇరగదీసేసినట్టే. 

అయితే, చిరంజీవి సినిమాలకు దూరమయి చాలాకాలమే అయ్యింది. ఈజ్‌ అలాగే వుండొచ్చేమోగానీ, ఇదివరకటిలా మెస్మరైజింగ్‌ డాన్సుల్ని చిరంజీవి నుంచి ఆశించగలమా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఇంకోపక్క, లారెన్స్‌తోపాటు మరో ఇద్దరు కొరియోగ్రాఫర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. వారిద్దరూ చెరో సాంగ్‌కి కొరియోగ్రఫీ చేస్తారట. ఈ రెండు సాంగ్స్‌ విదేశాల్లో చిత్రీకరించనున్నారు. 

'టాప్‌ లేచిపోద్ది..' అంటూ 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలోని పాటకి కొరియోగ్రఫీ చేసిన శేఖర్‌ మాస్టర్‌, చిరంజీవితో తొలిసారి వర్క్‌ చేస్తుండడం గమనార్హం. మరోపక్క, చరణ్‌ సినిమాలతో పాపులర్‌ అయిన జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలోనూ చిరంజీవి డాన్స్‌ చేయనున్నారు. అంటే, మొత్తంగా సినిమాలోని పాటలన్నీ డాన్సింగ్‌ నంబర్స్‌ అనుకోవాలి. ఏరికోరి, చిరంజీవి ఈ కొంరియోగ్రాఫర్లను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. 

లారెన్స్‌ చిరంజీవికి అలవాటే.. శేఖర్‌, జానీ – చిరంజీవికి కొత్తే కావడంతో వారి నుంచీ కొత్త స్టెప్పులు రావొచ్చు. ప్రభుదేవా లైన్‌లో వున్నానని చెప్పినా, చిరంజీవి ఛాన్సిచ్చినట్లు కన్పించడంలేదు. ఓవరాల్‌గా చిరంజీవి సినిమా అంటేనే అందులో డాన్సులు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కావడంతో చాలా కేర్‌ తీసుకున్నారన్నమాట. చూద్దాం.. చాలాకాలం తర్వాత చిరంజీవి హీరోగా వస్తున్న ఈ సినిమాతో డాన్సుల్లో మళ్ళీ మెగాస్టార్‌ కొత్త ట్రెండ్‌ సృష్టిస్తారో లేదో.!