రాజ్ కిరణ్ అంటే మన జనాలకు అంతగా గుర్తుకు రాదు కానీ, పందెం కోడి సినిమాలో హీరోయిన్ తండ్రి గా నటించిన నటుడు అనగానే టక్కున గుర్తుకు వస్తాడు. అలాంటి నటుడు చెప్పిన విషయాలు జనాలు కొత్తగా ఫీలవ్వాలేమో కానీ టాలీవుడ్ కు కొత్త కాదు. ఇక్కడ హీరో ను డామినేట్ చేసే నటులను పక్కకు తప్పించేయడం, రెమ్యూనిరేషన్లు ఎగ్గొట్టడం అన్నది కామన్. టాలీవుడ్ లో పూర్తి స్థాయి రెమ్యూనిరేషన్ అందండం అన్నది రేర్ గా జరుగుతుంటుంది. అలాగే హీరో కోటరీలోని నటులను మాత్రమే తీసుకోవడం, హీరోను డామినేట్ చేస్తారనుకునే వారిని పట్టించుకోకపోవడం కూడా మామూలే.
రాజ్ కిరణ్ ఇప్పుడు ఇవే విషయాలు మరోసారి చెప్పాడు. గోవిందుడు అందరి వాడేలే సినిమా కోసం రాజ్ కిరణ్ ను తాత క్యారెక్టర్ కు తీసుకున్నారు. చాలా వరకు షూట్ అయ్యాక పక్కకు తప్పించి, మన జనాలకు బాగా అలవాటైపోయిన ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. రాజ్ కిరణ్ తో చేసిన సీన్లు అంత బాగా రాలేదని, అందుకే మార్చారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.
కానీ ఇన్నాళ్ల తరువాత రాజ్ కిరణ్ చెప్పిన సంగతులు రివర్స్ లో వున్నాయి. హీరో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి రష్ చూసి, హీరో రామ్ చరణ్ నా? రాజ్ కిరణ్ నా? అని అడిగారని, హీరోను డామినేట్ చేస్తున్నారని ఫీలయ్యారని, అందుకే చెప్పా పెట్టకుండా తనను తప్పించారని తెలిసిందని రాజ్ కిరణ్ ఇప్పుడు వెల్లడించారు.
అంతే కాదు. ఆ వేషానికి సంబంధించి నిర్మాత ఇవ్వాల్సిన పది లక్షలు సెటిల్ కాలేదని కూడా రాజ్ కిరణ్ తెలిపారు. అంటే వేషమూ పోయింది. పారితోషికం కూడా రాలేదు. రెండింటికి చెడడం అంటే ఇదే. టాలీవుడ్ లో ఇది కామన్ అని రాజ్ కిరణ్ కు తెలిసి వుండదు. తెలిసి వుంటే ఇప్పుడు ఇలా బయటపడీ వుండరు. దీనివల్ల పాపం, మరెవరు ఆయన దగ్గరకు వెళ్లరు. చిరంజీవిని బదనామ్ చేసిన నటుడిని తమ సినిమాల్లోకి ఎవరైనా తీసుకుంటారా టాలీవుడ్ లో?