బాహుబలి తరువాత మరో మెగా వెంచర్ కోసం చాలా వెల్ ప్లాన్డ్ గా పావులు కదులుతున్నాయి. చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అలియాస్ మహావీర్ కోసం చాలా స్మూత్ గా ఏర్పాట్లు సాగుతున్నాయి. చాలా కామ్ గా ఇటీవలే హోమాలు, పూజులు జరిపించి, సింపుల్ గా ఓపెనింగ్ చేసేసారు. శ్రావణమాసం వెళ్లిపోతోంది కాబట్టి, చిరు బర్త్ డే దాకా ఆగలేదు. కానీ అసలు సిసలు ఫంక్షన్ చిరు బర్త్ డే నాడు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చేస్తున్నాయి.
మహావీర్ ఫస్ట్ లుక్ మోషన్ ఫోస్టర్ విడుదలకు చిరు బర్త్ నాడు భారీ హడావుడే చేస్తున్నట్లు ఈ వార్తలు వెల్లడిస్తున్నాయి. ఈ పోస్టర్ ను తెలుగు దర్శక బాహుబలి ఎస్ ఎస్ రాజమౌళి విడుదల చేస్తారట. అంటే సినిమా షూట్ ప్రారంభం కాకుండానే, డే వన్ నుంచే ఈ ప్రాజెక్టుకు మాగ్జిమమ్ హైప్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట.
మెగాస్టార్ తన 150వ సినిమాగా ఫక్తు కమర్షియల్ సినిమా చేయడంపై కొన్ని విమర్శలు వినిపించాయి. అదే సమయంలో బాలయ్య తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రాత్మక సినిమా చేసారు. చిత్రంగా ఆ తరువాత బాలయ్య ఫక్తు మాస్ మసాలా సినిమాను ఎంచుకుంటే, చిరంజీవి ఉయ్యాలవాడ లాంటి మాంచి దేశభక్తి సినిమాను ఎంచుకున్నారు. ఉయ్యాలవాడ కథను జాతీయస్థాయి సినిమాగా మార్చాలంటే చాలా కసరత్తు కావాలి. అందుకే బాలీవుడ్ తారాగణం, టెక్నీషియన్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై చిరు బర్త్ డే నాడు క్లారిటీ వస్తుంది.
వాటిని బట్టి, సినిమా స్థాయి, బడ్జెట్ తదితర అంశాలన్నింటిపై ఓ క్లారిటీ వస్తుంది. వినవస్తున్న వార్తలన్నీ నిజాలైతే, మళ్లీ తెలుగు తెరపై బాహుబలి లాంటి బృహత్ ప్రయత్నం ఒకటి ప్రారంభమయ్యే సూచనలు వున్నాయి. కానీ ఆ రేంజ్ సినిమా కావాలి అంటే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, అందుకు తగ్గ మల్టీ స్టారర్ కూడా కావాలి.
రెహమాన్ పక్కా.. ఐశ్వర్య?
మహావీర్ ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా ఎఆర్ రెహమాన్ పక్కా అయ్యారని వార్తలు వినవస్తున్నాయి. ఒక హీరోయిన్ గా నయనతార ఓకె అయింది. మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ తో చర్చలు సాగుతున్నాయి. కానీ ఇంకా పక్కా కాలేదు. 22 నాటికి సెటిల్ అవుతుందా? అన్నది చూడాలి. ఐశ్వర్య ఈ ప్రాజెక్టుకు తోడయితే కచ్చితంగా మాంచి బజ్ వస్తుంది. మరోపక్క కన్నడ స్టార్ సుదీప్ ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇలా సుదీప్, ఐశ్వర్య, నయనతార తోడయితే, పక్కాగా నేషనల్ రేంజ్ వస్తుంది.