రావాల్సిన వ్యక్తి ఇంకా రాలేదు. ఎందుకట.? ఆయనెవరో కాదు, తమిళ హీరో విజయ్‌కాంత్. 'అమ్మ' జయలలిత మరణానంతరం పలువురు సినీ ప్రముఖులు నానా యాగీ చేసేస్తున్నారు తమిళనాడులో. సైలెంట్‌గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడులో రాజకీయాలు చక్కబెట్టేస్తున్నారట. సినీ నటి గౌతమి, 'అమ్మ' మరణంపై అనుమానాలున్నాయంటూ ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖాస్త్రం సంధించారు. ఇంకోపక్క, గౌతమి ఆరోపణల్ని ఖండిస్తూ, మరో లేఖాస్త్రాన్ని ప్రధాని నరేంద్రమోడీకి సంధించారు నటుడు శరత్‌కుమార్. ఇదిలా వుంటే, తాజాగా రజనీకాంత్, డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధితో భేటీ అయ్యారు.
అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది.? జయలలిత మరణం పట్ల ఎవరెవరికి ఎలాంటి అనుమానాలున్నాయి.? ఈ అనుమానాలన్నీ 'అమ్మ' మీద అభిమానంతోనేనా.? లేదంటే, 'అమ్మ' పేరు చెప్పి రాజకీయంగా ఎదుగుదామన్న కుటిల ఆలోచనలతోనేనా.? ఇంత జరుగుతున్నా విజయ్‌కాంత్ ఎక్కడ.? తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేస్తానంటూ డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్, రాజకీయంగా ఎందుకింత మౌనం దాల్చుతున్నారు.? ఏమో, ఇదే ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు.
తమిళనాడులో సినీ, రాజకీయాలు చాలా చిత్రంగా వుంటాయి. కొందరు కొన్ని పార్టీలకు బాహాటంగా మద్దతిస్తుంటారు. కొందరు అన్ని పార్టీలతోనూ సన్నిహితంగా వుంటారు. కొందరు, ఏ పార్టీతోనూ లింకులు లేనట్టే వుంటారుగానీ, తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టేస్తుంటారు. అక్కడి సినీ రాజకీయం అర్థం చేసుకోవడం ఎవరితరమూ కాదు.! వ్యక్తి పూజకి పరాకాష్ట తమిళ రాజకీయాలు. అందులో సినీ ప్రముఖుల 'అతి' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఎక్కడ రజనీకాంత్ కొత్త పార్టీ పెడతారోనన్న టెన్షన్ ప్రస్తుతం చాలా రాజకీయ పార్టీల్ని వెంటాడుతోంది. కరుణానిధి అనారోగ్యం.. ఆయన్ని కలవడానికి రజనీకాంత్‌కి ఓ కారణం మాత్రమేనట. 'మర్యాదపూర్వకం' అని చెబుతున్నా, కరుణానిధి స్వయంగా పిలిపించుకుని మరీ, రజనీకాంత్‌తో రాజకీయాలు చర్చించారన్న ప్రచారం జరుగుతోంది. ఎఐఏడీఎంకె నుంచి ఓ వర్గం మెప్పు కోసం గౌతమి ప్రయత్నిస్తోంటే, ఇంకో వర్గం మెప్పు కోసం శరత్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు.
కథ ఇప్పుడే మొదలయ్యింది.. ముందు ముందు సినిమా చాలా వుంది.. ఇంకెంతమంది ప్రముఖులు 'అమ్మ' పేరుతో మీడియాకెక్కుతారో వేచి చూడాల్సిందే.