'కాలా'.. ఇది రజనీకాంత్ తాజా చిత్రం టైటిల్. 'కబాలి' తర్వాత రజనీకాంత్, పా.రంజిత్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. రజనీకాంత్ అల్లుడు, సినీ నటుడు – నిర్మాత ధనుష్ నిర్మిస్తోన్న ఈ 'కాలా' చిత్రంలో రజనీకాంత్ ఎలా కన్పించబోతున్నాడు.? 'కబాలి'కి ఇది సీక్వెల్ అనుకోవచ్చా.? లేదంటే, ఈ సినిమాతో రజనీకాంత్ రాజకీయ అస్త్రాన్ని ఎక్కుపెట్టబోతున్నారా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు.. వాటికి సమాధానాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
అన్నట్టు, 'కాలా' సినిమాకి 'కరికాలన్' అనే ట్యాగ్‌లైన్ తగిలించారు. కరికాలన్ అంటే అర్థం యోధుడు, సమర్థుడు అని. దాంతో, ఇది నూటికి నూరుపాళ్ళూ పొలిటికల్ సినిమాయేనని రజనీకాంత్ అభిమానులు భావిస్తున్నారు. మరోపక్క, ఈ సినిమా టైటిల్ వెనుక రాజకీయ కారణాలేమీ లేవనీ, పవర్‌ఫుల్‌గా వుంటుందనే ఈ టైటిల్ పెట్టామని నిర్మాత ధనుష్ చెబుతున్నాడు.
ఇదిలా వుంటే, 'కబాలి' సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, పా.రంజిత్‌పై పూర్తిస్థాయి నమ్మకంతో రజనీకాంత్, అతనికే ఇంకోసారి అవకాశమివ్వడం, పైగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ టైటిల్స్‌ని ఒకేసారి విడుదల చేయడం వెనుక ధనుష్ 'మార్కెటింగ్' టెక్నిక్ అద్భుతహ.. అన్నది తమిళ సినీ వర్గాల్లో విన్పిస్తోన్న వాదన.
ఇంతకీ, రజనీకాంత్ 'కాలా' పేరుతో చేస్తున్న సినిమాలో సగటు సినీ యోధుడి (హీరో) పాత్రనే చూస్తామా.? లేదంటే, పొలిటికల్ యోధుడిగా చూడబోతున్నామా.? వేచి చూడాల్సిందే.