ఆదిత్య మ్యూజిక్ అంటే తెలుగు సినిమా ఆడియో రంగంలో వన్ అండ్ ఓన్లీ కీ ప్లేయర్. ఇప్పుడు ఆ సంస్థ సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో టీ సీరీస్ మాదిరిగా ఇకపై ఆదిత్య బ్యానర్ పై సినిమాలు నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆడియో సేల్స్ ఎలా వున్నా, యూ ట్యూబ్, డిజిటల్ రైట్స్ కు డిమాండ్ బాగానే వుంది. శాటిలైట్ రైట్స్ సంగతి సరేసరి.
అందుకే ఇలా అన్ని విధాలా తమ మార్కెటింగ్ అవకాశాలు వున్నందున, వాటి కాలుక్యులేషన్ రేంజ్ లో సినిమాలు నిర్మించాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు వినికిడి. ఈ నిర్మాణ కార్యక్రమం కూడా చకచకా ఓ రేంజ్ లో సాగించేందుకు ఆదిత్య వివిధ యంగ్ హీరోలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
నిజానికి ఇప్పుడు తెలుగు సినిమాకు మీడియం రేంజ్ నిర్మాతలు కరువైపోయే ప్రమాదం వచ్చింది. లిక్కర్, రియల్ ఎస్టేట్ రంగాల నుంచి బ్లాక్ మనీ ఇండస్ట్రీలోకి వచ్చేది. ఇప్పుడు ఇక ఆ అవకాశం లేదు. అందువల్ల ఇలాంటి సంస్థలు అడుగుపెడితే మంచిదే.