కలెక్షన్స్‌ను మించి… ‘బాహుబలి’ ఇచ్చిందేమిటి?

ఒక సినిమా సూపర్‌హిట్ అయిందంటే అది పెట్టుబడి దారులకు వసూళ్లు మాత్రమే కాదు సినీ పరిశ్రమకు అవసరమైన మరెన్నో సూచనల ‘మూట’నూ అందిస్తుంది. అదే క్రమంలో సూపర్‌హిట్ అనే నిర్వచనానికి కొన్ని రెట్లు ఎక్కువ…

ఒక సినిమా సూపర్‌హిట్ అయిందంటే అది పెట్టుబడి దారులకు వసూళ్లు మాత్రమే కాదు సినీ పరిశ్రమకు అవసరమైన మరెన్నో సూచనల ‘మూట’నూ అందిస్తుంది. అదే క్రమంలో సూపర్‌హిట్ అనే నిర్వచనానికి కొన్ని రెట్లు ఎక్కువ స్థాయి విజయాన్ని దక్కించుకున్న బాహుబలి సినిమా టాలీవుడ్ పరిశ్రమకు ఇచ్చిన లెక్కలేనన్ని వాటిలో లెక్కలోకి తీసుకోకతప్పని కొన్ని…

వైవిధ్యభరిత చిత్రాలను ఆదరించే అభిరుచిలో తెలుగు ప్రేక్షకులు ఎవరికీ తీసిపోరని ‘తెలుగు సినీ ప్రేక్షకులు విభిన్న తరహా చిత్రాలను చూడరు’ అంటూ హేళనగా మాట్లాడే కొందరు అన్యభాషా చిత్ర ప్రముఖుల (సిద్ధార్ధ లాంటి హీరోలు)ను చాచి కొట్టేలా ప్రపంచానికి చాటి చెప్పింది.

పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ… అద్భుతమైన చిత్రాల వసూళ్లను ఏమాత్రం దెబ్బతీయలేదని నిరూపించింది. ఒక కుటుంబం రూ.వెయ్యి ఖర్చుపెట్టుకుని సినిమా ధియేటర్‌కి వెళ్లి చూడాలంటే ఆ సినిమా సత్తా కూడా అదేస్థాయిలో ఉండాలని తేల్చి చెప్పింది.

జానపద, చారిత్రక , పౌరాణిక విశేషాల పరంగా మనకు అమూల్యమైన వారసత్వ సంపద ఉందని, మంచి కధల కొరత అనే బదులు అది వాడుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చునని గుర్తు చేసింది.

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అన్నట్టే… సినిమా మంచిదైతే చుట్టూ ఉన్న నోర్లన్నీ మంచే కోరుకుంటాయని, అంతకు మించిన ప్రచారం మరేదీ ఉండదని రుజువు చేసింది.

‘మా సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్’ అంటూ ప్రేక్షకుల్ని ఊరించాల్సిన అవసరం లేదని, వినోదం అంటే కేవలం నవ్వించడం మాత్రమే కాదని నవరసాల సమ్మేళనమనే విషయం వారికి బాగా తెలుసని నొక్కి వక్కాణించింది.

సుదీర్ఘకాలం షూటింగ్‌లు, రిలీజ్ డేట్ వాయిదాలు, భారీ అంచనాలు… వంటివన్నీ సినిమాకు ప్రతికూలంగా పనిచేసి దాని ఫలితాన్ని తారుమారు చేస్తాయనేది మూఢనమ్మకం లాంటిదేనని, పరాజయ భారం నుంచి తప్పించుకోవడానికి వెతికే సాకు మాత్రమేనని తేటతెల్లం చేసింది. 

ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమా స్టామినాను చాటిచెప్పడం, చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని లిఖించడాన్ని మించి  ఎన్నో రకాల మంచి ఉపయుక్తమైన వసూళ్లను బాహుబలి సాధించింది. వీటిని సరిగ్గా వినియోగించుకుంటే డబ్బుని మించిన శక్తిని, సత్తువని తెలుగు సినిమాకి అందిస్తాయి.

ప్రేక్షకుల విజ్ఞప్తి…

తెలుగు సినీ ప్రముఖులూ… ఎప్పటిలాగే మీరు సినిమాలు తీసుకోండి. దెయ్యాలే ‘దిక్కు’ అంటూ హారర్ కామెడీలను కలిపి కొట్టి మమ్మల్ని ప్రేక్షక దేవుళ్లని చేయండి. యూత్ లవ్ మూవీ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగుల్లో మాకు ట్రైనింగు ఇవ్వండి. ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌లను నమ్మశక్యం కాని రీతిలో మాస్ హీరో చితక్కొట్టే పాత చింతకాయల పులుపుని మాకు ఇంకా ఇంకా అలవాటుగా మార్చండి. సుమోలను ఎగరగొట్టండి. ప్రోమోలను అదరగొట్టండి. కాని అప్పుడప్పుడైనా… బాహుబలిని గుర్తుకు తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే అన్నీ అంత గొప్ప సినిమాలే మాకు వస్తాయని, రావాలని కాదు. కొన్నయినా మేం తలెత్తుకుని, కుటుంబమంతా కలిసి చూసేవి… ఇవి మా సినిమాలు అంటూ కాలరెగరేసుకుని చెప్పగలిగేవి వస్తాయని… సగటు తెలుగు ప్రేక్షకుడికి ఇది అత్యాశ కాకూడ దని కోరుకుంటూ… జై బాహుబలి.

 -ఎస్బీ.