దిగ్ద దర్శకుడు, ఇండస్ట్రీ పెద్ద దాసరి నారాయణ రావు వెళ్లిపోయారు. ఆయన సంపాదించిన ఆస్తులు, కుటుంబం మిగిలింది. అలాగే ఆయన కొంత మేరకు ఇండస్ట్రీలోని వివిధ వ్యక్తులకు కొంత మొత్తాలను ఇచ్చారని, వీరిలో ఓ నిర్మాత, మరో ఫైనాన్షియర్ వున్నారని గుసగుసలు వినవచ్చాయి. ఇదిలా వుంటే దాసరి ఆస్తులన్నీ ఏదో ఒక చిక్కులోనే వున్నాయని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ఆయన వుంటున్న ఇంటి పై కూడా అప్పు వుందట. నగరంలో వున్న పలు అపార్ట్ మెంట్ లు, మరి కొన్ని ఆస్తులు అటాచ్ మెంట్ ల్లో వున్నాయట. ఇవన్నీ సెట్ కావడానికి కొంచెం టైమ్ పడుతుందని తెలుస్తోంది. మొదటి సారి ఆసుపత్రికి వెళ్లడానికి ముందే దాసరి తన సన్నిహితుల ద్వారా కొన్ని ఆర్థిక లావాదేవీలు చక్క బెట్టే ప్రయత్నం చేసారట. అవి ఒక కొలిక్కి వచ్చాయట. కానీ కార్యాచరణలోకి మాత్రం రాలేదట. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది.
దాసరి ఇంటిపై కూడా అప్పు వుండడానికి ఆయన భారీ మెయింట్ నెన్స్ ఖర్చే కారణం అని తెలుస్తోంది. నెలకు ముఫై లక్షల వరకు దాసరి కుటుంబం మెయింట్ నెన్స్ ఖర్చలు వుండేవట. కరెంట్ బిల్లు భారీగా వచ్చేదట. రోజంతా బోలెడు ఏసి లు రన్ అవుతూనే వుండేవట. ఓ థియేటర్ కరెంట్ బిల్లు మాదిరిగా వచ్చేదట దాసరి ఇంటి బిల్లు. ఆఫీసు నిండా జనం, భోజనం టైమ్ లో కనీసం రెండు డజన్ల మంది వుండేవారట. దీంతో రోజూ పదుల సంఖ్యలో పాల ప్యాకెట్లు కొనేవారట.
ఎంత మంది వచ్చినా కాఫీ, టీలు, భోజనం అందించడం అన్నది దాసరికి రివాజు. దీనివల్ల ఆదాయం వున్నా లేకున్నా, నెలకు ముఫై లక్షల వరకు ఖర్చు వుండేదట. బయటకు ఇచ్చిన మొత్తాలు రాక, చేతిలో సమయానికి మొత్తాలు లేక, ఇంటిపై అప్పుతెచ్చారని ఓ గుసగుస వినిపిస్తోంది. ఇప్పుడు దాసరి లేకున్నా, ఆయన అభిమాన సన్నిహితులు ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దే పనిలో వున్నారు.