నేను బయోగ్రఫీ రాస్తున్నా.. మూడున్నర సంవత్సరాల నుంచి ఆ పని జరుగుతోంది. అయితే అది పూర్తవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. ఇంకా ఒకటిన్నర సంవత్సరం పడుతుంది..’ అంటూ ఆ మధ్య ఒక సారి ప్రకటించారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. తెలుగు సినిమాతో పాటు దశాబ్దాల ప్రయాణం చేసిన, వందల కొది సినిమాలకు పని చేసిన వ్యక్తి.. ఇండస్ట్రీకే ‘గురువుగారు’ గా చలామణి అయిన వ్యక్తి..
మరలాంటాయన బయోగ్రఫీ రాస్తే అంతకు మించిన ఆసక్తికరమైన అంశం ఏం ఉంటుంది? బయోగ్రఫీ అంటే.. కేవలం తన చరిత్రను తనకు నచ్చినట్టుగా చెప్పుకోవడం కాదు, ఇండస్ట్రీ చరిత్రనంతా ప్రస్తావిస్తానని దాసరి అన్నారు. మొత్తం ఇండస్ట్రీలోని చాలా మంది గురించి ప్రస్తావిస్తానని.. పెద్దవాళ్లుగా పరిగణింపబడే వారి జాతకాలన్నీ చెబుతాను అని దాసరి వ్యాఖ్యానించారు.
కొంత కాలం కిందట ఒక పుస్తకం ఆవిష్కరణ సభలో దాసరి ఆ వ్యాఖ్యలు చేశారు. తన బయోగ్రపీ బయటకు వస్తే.. చాలా మంది అసలు గుట్లు బయటపడతాయని దాసరి అన్నారు. ఎన్టీఆర్ ను పరిచయం చేసింది ఎవరు? అంటే ఎల్వీ ప్రసాద్ అంటారని, అలాంటి అబద్ధాలే ఇండస్ట్రీలో ప్రచారానికి నోచుకుంటున్నాయని.. అనేక మంది విషయంలో అలాంటి అబద్ధాలే ప్రచారంలో ఉన్నాయని దాసరి అప్పుడు వ్యాఖ్యానించారు.
కొన్నాళ్లుపోతే ఇండస్ట్రీ ఎక్కడ మొదలైందంటే హైదరాబాద్ లో అంటారని, ఫలానా సినిమాతో ఇండస్ట్రీ గమనం మొదలైందని అంటారని.. అయితే ఆ పరిస్థితి ఉండకూడని, వాస్తవాలు తెలియాలని దాసరి అన్నారు. తన బయోగ్రపీ సంచలనాలన్నింటి వాస్తవాలతో వస్తుందని వ్యాఖ్యానించారు. మరి తన బయోగ్రఫీ గురించి దాసరి అంత వాడీవేడీగా చెప్పడంతో.. అది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరి ఇప్పుడు ఆయన తుదిశ్వాస విడవడంతో, అందరికీ దూరం అయిపోవడంతో.. వారి బయోగ్రఫీ అర్ధాంతరంగా ఆగిపోయినట్టే, సంచలనాలు చీకటిలోనే మిగిలిపోయినట్టే!