బెల్లంకొండ బ్లాక్‌మెయిలింగ్ పై పుకార్ల వెల్లువ!

బెల్లంకొండ సురేష్ – హీరో రామ్ ను బ్లాక్ మెయిల్ చేశారా? రామ్ కు సుమారు ఆరేళ్ల కిందట తాను ఇచ్చిన అడ్వాన్సు మొత్తం కోటిన్నరరూపాయలను వడ్డీతో సహా వసూలు చేసుకోవడం కోసం.. ఒక…

బెల్లంకొండ సురేష్ – హీరో రామ్ ను బ్లాక్ మెయిల్ చేశారా? రామ్ కు సుమారు ఆరేళ్ల కిందట తాను ఇచ్చిన అడ్వాన్సు మొత్తం కోటిన్నరరూపాయలను వడ్డీతో సహా వసూలు చేసుకోవడం కోసం.. ఒక స్కెచ్ ప్రకారం బ్లాక్ మెయిల్ ఎపిసోడ్ నడిపించాడా?  శుక్రవారం విడుదల అయిన రామ్ చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రానికి సంబంధించి మాస్టర్ హార్డ్ డిస్క్ ను చేజక్కించుకుని , తన అడ్వాన్సు తిరిగి చెల్లించకపోతే.. సినిమాను విడుదలకు ముందే నెట్ లో పెట్టేస్తానంటూ బెదిరించారా? చివరికి పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారా…? ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పుకార్లు విచ్చలవిడిగా షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను అటు బెల్లంకొండ సురేష్, నిర్మాత రవికిషోర్ కూడా ఖండించారు. అయితే అడ్వాన్సులు వసూలు చేసుకోవడంలో నిర్మాతల తాలూకు ఇది కొత్త ఎత్తుగడ కావడంతో.. వైరల్ గా  ప్రచారం అవుతోంది. 

వివరాల్లోకి వెళితే.. నిర్మాత బెల్లంకొండ సురేష్ గతంలో హీరో రామ్ తో కందిరీగ చిత్రం చేశాడు. అది విజయవంతం అయ్యాక దానికి సీక్వెల్ కూడా చేయాలని అనుకున్నారు. అందుకోసం హీరోకు ఒకటిన్నర కోటి ఎడ్వాన్సుగా చెల్లించాడు. కథలను విన్న రామ్ వాటిని తిరస్కరించాడు. వాటిలో ఒకటి రభస చిత్రంగా తెరకెక్కింది కూడా. అయితే ఆ తర్వాత బెల్లంకొండ- రామ్ కాంబినేషన్ లో చిత్రం మాత్రం రాలేదు. ఏళ్లు గడుస్తున్నా రామ్ తాను తీసుకున్న ఎడ్వాన్సు కూడా తిరిగి ఇవ్వలేదు. దీనితో విసిగిపోయిన బెల్లంకొండ మాస్టర్ స్కెచ్ వేసినట్లుగా తాజా పుకారులో ప్రచారం జరిగింది. 

పుకార్లలో మిగిలిన ప్రచారం ఏంటంటే.. ‘‘ ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం మాస్టర్ హార్డ్ డిస్క్ ను ఆయన ఎలాగోలా సంపాదించారు. అక్కడినుంచి హీరోకు బెదిరింపులు మొదలయ్యాయి. తన డబ్బు ఇవ్వకపోతే.. సినిమా నెట్ లో పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తన వద్ద ఉన్నది అసలు సినిమానే అని తెలిసేలా.. కొన్ని రుజువులు కూడా చూపించాడు. తన మీద పోలీసు కంప్లయింటు ఇచ్చినా ఖాతరు చేయనని.. అరెస్టు అయ్యేలోగా సినిమా నెట్ లోకి వెళ్లగలదని హెచ్చరించినట్లు సమాచారం. సినిమా నిర్మాతల మండలి వరకు వెళ్లిన తర్వాత.. పరిశ్రమలోని ఇద్దరు పెద్దలు జోక్యం చేసుకుని.. తీసుకున్న అడ్వాన్సు మొత్తం అసలు మాత్రం చెల్లించేలా ఒప్పందం చేశారు. ఆ మేరకు సొమ్ము ఇచ్చిన తరువాత.. హార్డ్ డిస్క్ తిరిగి ఇవ్వడంతో.. సినిమా ఇవాళ విడుదలకు నోచుకున్నదని తెలుస్తోంది.’’

ఈ పుకార్లలో నిజానిజాలు తేలాల్సి ఉంది. హీరో రామ్ మీడియాకు అందుబాటులోకి రాకపోయినా.. ఈ ప్రచారం నిజం కాదని స్రవంతి రవికిశోర్, బెల్లంకొండ వేర్వేరుగా ఖండించడం గమనార్హం.