అనుభవాన్ని సరిగ్గా వాడుకుంటే ఫలితం బాగానే వుంటుంది. సినిమాలు, కథల ఎంపిక, వాటిని సినిమాలుగా మార్చడంలో దిల్ రాజు అనుభవం బాగానే పనికి వస్తోంది. శతమానం భవతి సినిమా హిట్ తో జోష్ మీద వున్న నిర్మాత దిల్ రాజుకు నేను లోకల్ ఫలితం కూడా ఆనందాన్నే ఇచ్చింది. ఈ సినిమాకు నాని ని హీరోగా తీసుకోవాలనుకున్న దిల్ రాజు ఆలోచన పక్కా ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు నేను లోకల్ సినిమా చూసిన వారు నాని హీరోగా కాకపోయి వుంటే ఈ సినిమా ఫలితం డవుట్ లో పడేదని కామెంట్ చేస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా కథను నిర్మాత బెక్కం వేణుగోపాల్ తీసుకువచ్చారు. అది కూడా రాజ్ తరుణ్ హీరోగా సినిమా చేయాలని. దానికి ఫైనాన్స్ నో, భాగస్వామ్యం కోసం అనో. అయితే కథ విన్నాక, దిల్ రాజు ఈ కథకు నాని అయితేనేం పక్కాగా వుంటుందని, తనకు వదిలేస్తే, తానే నిర్మిస్తానని చెప్పేసారు. దాంతో బెక్కం వేణుగోపాల్ తెరవెనుక వుండి దిల్ రాజు ముందుకు వచ్చారు. రైటర్ ప్రసన్న, డైరక్టర్ నక్కిన త్రినాధ్ ఇద్దరూ రాజ్ తరుణ్ నే అనుకున్నా, దిల్ రాజు నిర్మాతగా మారడంతో నానితో చేసారు.
ఇప్పుడు సినిమా చూసిన వారు రాజ్ తరుణ్ చేసి వుంటే, సినిమా చూపిస్తామావా మళ్లీ అటు ఇటు చేసి తీసారనే పేరు వచ్చి వుండేదని, నాని చేయడంతో కొత్తగా ఫీలవ్వడంతో పాటు, మాంచి ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు. నానితో ఈ ప్రాజెక్టు చేస్తే పెర్ ఫెక్ట్ అనుకున్న దిల్ రాజు అంచనా ఆ విధంగా నిజమైంది.