దిల్ రాజుకు ఆల్ టైమ్ హిట్

నిర్మాత దిల్ రాజు కెరీర్ లో బోలెడు హిట్ లు వున్నాయి. దిల్, బొమ్మరిల్లు దగ్గర నుంచి నిన్న మొన్నటి ఫిదా, ఎంసిఎ, నేను లోకల్ వరకు. అయితే ఎఫ్ 2 సినిమా మాత్రం…

నిర్మాత దిల్ రాజు కెరీర్ లో బోలెడు హిట్ లు వున్నాయి. దిల్, బొమ్మరిల్లు దగ్గర నుంచి నిన్న మొన్నటి ఫిదా, ఎంసిఎ, నేను లోకల్ వరకు. అయితే ఎఫ్ 2 సినిమా మాత్రం మెమరబుల్ హిట్ గా మిగిలిపోయేలా వుంది. ఎందుకంటే ఆయా సినిమాలు, ఆయా కాలాల్లో వున్న రేట్ల ప్రకారం కావచ్చు, అప్పటి ట్రెండ్ ప్రకారం కావచ్చు, భారీ హిట్ లే కానీ 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన దాఖలాలు తక్కువ.

మహేష్ నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అప్పట్లో యాభైకోట్లు జస్ట్ దాటగలిగింది అంతే. ఫిదా లాంటి హిట్ కూడా నైజాంలో కుమ్మేసింది కానీ ఆంధ్రలో కాదు. అది కూడా యాభై కోట్లు దాటలేదు. ఇక ఎంసిఎ, నేను లోకల్ లాంటి సినిమాలు కూడా పెద్ద హిట్ లే కానీ యాభైలు క్రాస్ చేయలేదు. శతమానం భవతి సెన్సెషనల్ హిట్ నే కానీ ఆ సినిమా నలభై దాటలేదు.

ఇక మిగిలింది బన్నీతో చేసిన దువ్వాడ జగన్నాధమ్ మాత్రమే. ఈ సినిమా ఆంధ్ర-తెలంగాణల్లో 58 కోట్ల వరకు చేసింది. కానీ ఈ సినిమా అంకెల మీద అప్పట్లో అనుమానాలు-వివాదాలు తలెత్తాయి. అందువల్ల వాటిని కొందరు కరెక్ట్ అంటారు. కొందరు కాదంటారు. ఆ సినిమా అంత హిట్ అనుకుంటే, ఆ సినిమా డైరక్టర్ హరీష్ శంకర్ కు ఇప్పటి వరకు మళ్లీ సినిమా లేదు.

ఇవన్నీ అలా వుంచితే ఇప్పుడు విడుదలైన ఎఫ్ 2 సినిమా మాత్రం విడుదలై పట్టుమని పదిరోజులు కాకుండానే 50 కోట్ల మార్క్ ను దాటేలా కనిపిస్తోంది. ఎనిమిది రోజులకు ఆంధ్ర-సీడెడ్-నైజాంల్లో 40 కోట్లకు చేరిపోయింది ఈ సినిమా. తొమ్మిదవ రోజు ఆదివారం కూడా సినిమా కలెక్షన్లు కుమ్మేసాయి. అందువల్ల పదవ రోజుతో 50 కోట్ల మార్క్ కు చేరువయ్యే అవకాశం వుంది.

అదే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే తొమ్మిదవ రోజుకే యాభైకోట్ల మార్క్ దాటేస్తుంది. ఇక నైజాం ఒక్కటీ చూసుకుంటే ఫిదా సినిమా ఇక్కడ 18 కోట్లకు పైగా చేసింది. ఎఫ్ 2 ఈ మార్క్ ను కూడా దాటేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఈ సినిమా నైజాంలో 15 కోట్ల వరకు వసూలు చేసింది.

వెస్ట్ లాంటి ఏరియాలో మూడు కోట్లకు చేరింది. ఇక్కడ మహా మహా పెద్ద సినిమాలే నాలుగు కోట్ల రేంజ్ కు వెళ్తాయి (బాహబలి సిరీస్ కు మినహాయింపు, దాని వ్యవహారం వేరే) ఉత్తరాంధ్ర 8 కోట్ల మార్క్ ను చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ అంకెలు ఇంకా పెద్దగా వున్నా ఆశ్చర్యం లేదు.

ఎందుకంటే ఈవారం అంతా ఆంధ్రలో సంక్రాంతి సరదాలు అక్కడా అక్కడా సాగుతూనే వుంటాయి. పైగా ఈవారం థియేటర్లలో ఫస్ట్ ఆప్షన్ ఇదే. మలివారం కూడా ఒకే ఒక్క సినిమా మిస్టర్ మజ్ఞు వుంది. అప్పటికి కథానాయకుడు, వినయ విధేయ పూర్తిగా వెనక్కు తగ్గుతాయి. అందువల్ల మజ్ఞు రిజల్ట్ ఎలా వున్నా కూడా ఎఫ్ 2 రన్ పక్కాగా వుంటుంది.

ఇప్పటికే చాలాచోట్ల టాప్ ఫైవ్ లోకి చేరుకుంటోంది ఎఫ్ 2. ఈ లెక్కన టోటల్ రన్ పూర్తయ్యే సరికి చాలా సినిమాల రికార్డులను దాటే అవకాశం క్లియర్ గా వుంది. ఆ విధంగా నిర్మాత దిల్ రాజకు ఎఫ్ 2 మెమరబుల్ సినిమాగా మిగిలిపోతుంది.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏమిటంటే, 2018 సెన్సెషనల్ హిట్ అయిన గీత గోవిందం సినిమా రికార్డులను కూడా చాలా చోట్ల (నైజాం మినహా) ఎఫ్ 2 దాటేసినా ఆశ్చర్యం లేదు.

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

రామ్ చరణ్ స్టామినా ఇది..!