ఇండియన్ 2 సినిమా ప్రాజెక్టుపై గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమై మూడు నాలుగు రోజులు అయింది. ఆరంభంలో దిల్ రాజు యూనిట్ జనాలు, అంతా ఉట్టిదే అని, ప్రాజెక్ట్ పక్కాగా వుందని చెబుతూవచ్చారు. ఇప్పటికీ అదే మాట వినిపిస్తోంది. కానీ చెన్నయ్ వర్గాలు మాత్రం భారతీయుడు 2 ప్రాజెక్టు నుంచి నిర్మాత దిల్ రాజు కావాలనే తప్పుకున్నారన్న వార్తలు వినవస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం దర్శకుడు శంకర్ కు అడ్వాన్స్ ఇవ్వాల్సి వుందని, కానీ దిల్ రాజు ఇవ్వలేదనీ అంటున్నారు. జస్ట్ కోటి రూపాయలు మాత్రం టోకెన్ అడ్వాన్స్ గా ఇచ్చారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి దిల్ రాజు కావాలనే తప్పుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి దిల్ రాజు మనస్తత్వానికి శంకర్ తో సినిమాకు సెట్ కాదు. ఎందుకంటే దిల్ రాజుకు దగ్గర వుండి సినిమా నిర్మాణం అంతా చూసుకోవడం, కథను తన అవగాహనతో అటు ఇటు మార్చుకోవడం ఇలా చాలా అలవాట్లు వున్నాయి. కానీ శంకర్ తో సినిమా అంటే అడిగినపుడల్లా డబ్బులు పంపడం తప్ప వేరే పని వుండదు. పైగా వందల కోట్ల ప్రాజెక్టు అంటే మాటలు కాదు. ఇప్పటి దాకా దిల్ రాజు సంపాదించినది పణంగా పెట్టడంతో సమానం.
మరి ఇవన్నీ ఆలోచించి, దిల్ రాజు కావాలని వెనక్కు తగ్గుతున్నారా? లేక తెరవెనుక మరేమైనా జరుగుతోందా? అన్నది అనుమానంగా వుంది.