రెండు రోజులుగా ఒకటే హడావుడి. అటు డిస్ట్రిబ్యూటర్ల సర్కిల్ లో. ఇటు ఎగ్జిబిటర్ల సర్కిల్ లో. పండగ సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో విడుదల తేదీల మీద. ఈ హడావుడికి ఫుల్ స్టాప్ పడాలి అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు విదేశాలకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఇండియా రావాలి. ఒకరు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, రెండవ వ్యక్తి హీరో బన్నీ.
వీరిలో దిల్ రాజు బుధవారం రాత్రి వచ్చేసారు. బన్నీ శుక్రవారం వస్తున్నారు. దిల్ రాజు గురువారం ఏదో టైమ్ లో అల్లు అరవింద్ తో ముందుగా సమావేశం కాబోతున్నారు. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందో? అక్కడ సరిదిద్దే ప్రయత్నాలు చేయబోతున్నారు.
12న రావడం వల్ల ఎక్కడెక్కడ థియేటర్ల సమస్య వస్తోంది అన్నది తీసుకుని, ఓ పద్దతి ప్రకారం సెట్ చేసే పని స్టార్ట్ చేస్తారు. ఈ విషయంలో మహేష్ టీమ్ కు కూడా కాస్త నచ్చ చెప్పే అవకాశం వుంది. కేవలం కొన్ని థియేటర్ల కోసం పంతానికి పోయి, రెండు సినిమాలు ఒకేసారి రావడం కన్నా, వేరుగా రావడం వల్ల మహేష్ కు అడ్వాంటేజ్ అవుతుంది. అందువల్ల మహేష్ టీమ్ కు నచ్చచెప్పే చాన్స్ వుంది.
10న సమస్యే లేదు
బన్నీ సినిమా 10న విడుదల అన్న ప్రసక్తే లేదని హారిక హాసిని యూనిట్ వర్గాల బోగట్టా. అజ్ఞాతవాసి సెంటిమెంట్ దర్శకుడు త్రివిక్రమ్ ను, నిర్మాణ యూనిట్ ను వెన్నాడుతోంది. అందువల్ల 10న విడుదలకు త్రివిక్రమ్ ససేమిరా అంటున్నారు. కావాలంటే 11నే విడుదల చేసుకోమంటున్నారు. అందువల్ల బన్నీ సినిమా 10న విడుదల అన్నది కష్టమే. వస్తే ఎప్పటిలా 11న, 12న రావడం లేదా, రెండూ 11 న రావడం మాత్రమే జరుగుతుంది. ఇప్పటికే 11 నుంచి, 12 నుంచి అంటూ టికెట్ ల పెంపుపై కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఇప్పడు ఒక రోజు ముందుకు వస్తే, ఆ ఒక్క రోజుకు మళ్లీ కోర్టు నుంచి టికెట్ ల పెంపు ఆర్డర్లు తెచ్చుకోవాల్సి వుంటుంది.
నేడు రేపు సెన్సారు
అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల సెన్సారు ఈరోజు రేపు జరగబోతోంది. ఈ రోజు మహేష్ బాబు సరిలేరు సెన్సారు షెడ్యూలు అయి వుంది. రేపు బన్నీ అల..సినిమా షెడ్యూలు అయి వుంది. ఇప్పటి వరకు ఈ సినిమాల మీద 'ట' 'ట' కబుర్లు వినిపించాయి. ఒకసారి సెన్సారు అయితే ఇక ఫీలర్లు బయటకు రావడం ప్రారంభమవుతుంది.
11 కోట్ల డెఫిసిట్?
మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా ఓవర్ బడ్జెట్ కారణంగా 11 కోట్ల డెఫిసిట్ తో విడుదలవుతున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అయితే పండగ విడుదల కావడం, సినిమా మీద భారీ పాజిటివ్ అంచనాలు వుండడంతో, ఓవర్ ఫ్లోస్ వస్తాయనే ధీమా వుంది. అలాగే విదేశంలో ఓన్ రిలీజ్ కాబట్టి అక్కడ కవర్ అవుతుందనే ధీమా వుంది.
బన్నీ సినిమాకు మాంచి లాభాలు రావాల్సి వుంది. కానీ ఆ సినిమా కూడా మెలమెల్లగా ఖర్చు కాస్త ఎక్కువే అయిపోయింది. పైగా గీతా ఆర్ట్స్ కు సగం లాభాలు ఇవ్వాల్సి వుంది. అందువల్ల హారిక హాసిని పెద్దగా మిగలకపోయచ్చు కానీ తగలడం మాత్రం వుండదు.