రాను రాను మరీ న్యూసెన్స్ కేసు అని జనం అనుకునేలా తయారవుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. అచ్చంగా రాజుగారి కథలా వుంది ఆయన వ్యవహారం. ముందు నడిస్తే తప్పు, వెనక నడిస్తే తప్పు, పక్కన నడిస్తే తప్పు..మెగాస్టార్ చిరంజీవి ఏ క్షణం అయితే పూరి డైరక్షన్ లో సినిమా చేయడం లేదని తెలిసిందో, అప్పటి నుంచి ఆయనను పట్టుకుని వేధిస్తున్నాడు. తన ఆప్తుడు పూరి తో సినిమా చేయనంటాడా..చెప్తా ఈయన సంగతి అన్నట్లుగా కనిపిస్తోంది వ్యవహారం చూస్తుంటే.
ముందేమో, 150 వ సినిమా అంటే బాహుబలి కన్నా పెద్ద హిట్ కావాలన్నాడు. దాంట్లో వెటకారం తెలుస్తూనే వుంది. చిరంజీవి 150వ సినిమా అంటే అదేమన్నా అద్భుతమా..ఆయనకు ఓ మైల్ స్టోన్. మహా అయితే వంద కోట్ల సినిమా కావాలి అనడం అంటే అర్థం వుంది. మల్టీస్టారర్, గ్రాఫిక్ సినిమా బాహుబలితో ముడి పెట్టడం ఏమిటి?
సరే, అయింది. 150 వ సినిమాను చిరంజీవి తప్పు మరెవరు డైరక్ట్ చేయలేరు..ఆయనే చేయాలి అన్నట్లు ట్వీట్ చేసాడు. అక్కడా వెటకారమే. మీకు పూరి నచ్చలేదు కదా..మరెవరు నచ్చుతారు..మీకు మీరే డైరక్ట్ చేసుకోండి అన్నది వెనకాల అర్థంలా కనిపిస్తోంది.
ఆ తరువాత ఊరుకొకుండా బ్రూస్ లీ వెంట పడ్డాడు. అదే పేరుతో తనో ట్రయిలర్ వదిలాడు. చరణ్ బ్రూస్ లీ విడుదలైన దగ్గర నుంచి దాటిపై ఏదో ఒకటి వేస్తూనే వున్నాడు.
ఇప్పుడు మళ్లీ చిరంజీవి 150 వ సినిమా మీద పడ్డాడు. పాపం, ఆయనేదో దొరక్క దొరక్క ఓ కథ దొరకబుచ్చుకుంటే..మళ్లీ తెలుగువారు, ఆత్మగౌరవం..తమిళ కథ వద్దు అంటూ అడ్డంకి. ఈయన మాత్రం హాలీవుడ్ సినిమాల నుంచి కొట్టుకు రావచ్చు. తన చిత్తానికి సినిమాలు చేయచ్చు. చిరంజీవికి మాత్రం రూల్స్ చెబుతాడు.
తన బాధ పడలేక అయినా పూరి కి చాన్స్ ఇస్తారనా? లేదా పూరికి చాన్స్ ఇచ్చేస్తే, ఇంక మెగా స్టార్ అంత మంచోడు లేరని ట్వీటుతాడా? ఏదయినా ఒక వ్యక్తిని, ఒక ఫ్యామిలీని, భావ స్వేచ్ఛ వుంది కదా అని ఇలా పదే పదే ట్విట్టర్ లో కామెంట్ చేయడం చూస్తుంటే, రాను రాను సోషల్ నెట్ వర్క్ అంటే ఇలాంటి వాళ్ల వల్ల విరక్తి పుట్టేలా వుంది.