పాపం యంగ్ హీరో రాజ్ తరుణ్ కు భలే సమస్య వచ్చింది. అతగాడివి రెండు సినిమాలు విడుదలకు రెడీగా వున్నాయి. ఒకటి ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన రాజుగాడు. మరొకటి అన్నపూర్ణ బ్యానర్ ఫై నాగ్ నిర్మించిన రంగులరాట్నం. ఎకె యూనిట్ తమ రాజూగాడు సినిమాను సంక్రాంతికి విడుదల చేసుకుందాం అనుకుంది. కానీ అన్నపూర్ణ సంస్ధ కూడా అదే డేట్ కు తమ రంగులరాట్నం తీసుకురావాలని అనుకుంది. పైగా వెనక్కుతగ్గేది లేదని ఫీలర్లు వదిలింది.
దీంతో మధ్యన తనకెందుకు ఇబ్బంది అని, 'మీరూ మీరూ చూసుకోండి. ఏ సినిమా అయినా నాకు ఓకె' అనేసి ఊరుకున్నాడు రాజ్ తరుణ్. అన్నపూర్ణ బ్యానర్ తో మనకెందుకు తలనొప్పి అని ఎకె వాళ్లు సైలెంట్ అయ్యారు. కానీ అన్నపూర్ణ బ్యానర్ ఇప్పుడు తన దృష్టి అంతా అఖిల్ హలో సినిమా మీద పెట్టింది. అది విడుదలయ్యే వరకు అంటే ఈ నెల 22దాకా నాగ్ మరో వైపు దృష్టి పెట్టరు.
అందవల్ల ఇటు రంగులరాట్నం సినిమా విషయం మొత్తం పక్కన పెట్టారు. ఒక లుక్ లేదు, టైటిల్ లోగో లేదు. హడావుడి లేదు. గట్టిగా నెల రోజులు టైమ్ లేదు విడుదలకు. ఎంత చిన్న సినిమా అయినా కాస్త హడావుడి వుండాలి కదా? పోనీ చెప్పుదాం అంటే నాగ్ ఏమనుకుంటారో?
సరే ఆ సినిమా వుంది కదా అని ఎకె జనాలు తమ రాజుగాడు సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టి కిర్రాక్ పార్టీ పై దృష్టి పెట్టింది. ఎప్పుడో పిబ్రవరిలో రావాల్సిన సినిమాలకు హడావుడి మొదలైంది కానీ, సంక్రాంతి రావాల్సిన సినిమాకు ఏమీ లేదు. కానీ రాజ్ తరుణ్ సైలెంట్ గా వున్నాడు. అంతకన్నా ఏం చేయాలి?