వైజాగ్ లంకపల్లి సత్యానంద్ అనగానే సినిమా జనాలకు అందరికీ గుర్తే. పవన్ కళ్యాణ్, మహేష్, ప్రభాస్ ఇలా ఈ జనరేషన్ యంగ్ హీరోలందరికీ నటనలో, ముఖ్యంగా డైలాగ్ మాడ్యులేషన్ లో శిక్షణ ఇచ్చింది ఆయనే. నటుడు కావాలనుకున్న సినిమా జనాల వారసులంతా విశాఖలో కొన్నాళ్ల పాటు వుండి లంకపల్లి సత్యానంద్ దగ్గర ట్రయినింగ్ పొందినవారే.
స్వతహాగా నాటక రచయిత, ప్రయోక్త అయిన సత్యానంద్ తను మాత్రం పెద్దగా సినిమాల పట్ల దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు రాఘవేంద్ర మాత్రం సినిమా రంగంలోకి కమెడియన్ గా రంగప్రవేశం చేస్తున్నారు. అది కూడా ఓ ప్రత్యేకమైన పాత్ర ద్వారా రావడం విశేషం.
లేడీస్ టైలర్ లో బట్టల సత్యం పాత్ర సూపర్ ఫేమస్ . అప్పట్లో మంచి కమెడియన్ అయిన మల్లికార్జున రావు ఈ పాత్రతో బట్టల సత్యం అయిపోయారు. ఆ సినిమాకు సీక్వెల్ నే ఫ్యాషన్ డిజైనర్. లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్. బట్టల సత్యం కొడుకు పాత్ర కూడా సినిమాలో వుందట. దాన్నే రాఘవేంద్ర చేస్తున్నారు.
బట్టల సత్యం పాత్ర పోషించిన మల్లికార్జున రావు, ఇప్పుడు సత్యం కొడుకు పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర ఇద్దరు విశాఖ వాసులే కావడం విశేషం.