తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఒక తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత తొలిసారి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా అంబికా కృష్ణ నియమితులయ్యారు.
రాష్ట్రం విడిపోక ముందు, విడిపోయిన తరువాత వినిపించిన సంగతులు ఏమిటంటే, చిత్ర పరిశ్రమ ఆంధ్రకు తరలిపోతుందని. కానీ సినిమా జనాల సంగతులు తెలిసిన వారు ఎవరూ ఆ వదంతులు నమ్మలేదు. సినిమా జనాలు తెలంగాణ ప్రభుత్వంతో మమేకమైపోయి, కేటీఆర్ తో చెట్టాపట్టాలేసుకుని, సెటిల్ అయిపోయారు. కేసీఆర్ కూడా అప్పట్లో రాచకొండ గుట్టల్లో మరో భారీ ఫిల్మ్ సిటీ కడతామన్నారు. అదంతా పక్కకు వెళ్లిపోయింది.
ఇదిలా వుంటే ఆంధ్రకు తరలిరమ్మని కానీ, విశాఖ, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో చిత్ర పరిశ్రమ కోసం ఏర్పాట్లు కానీ చేయలేదు. కానీ సినిమా వాళ్ల క్లబ్ కోసం మాత్రం విశాఖలో ఎకరాలకు ఎకరాలు ఇచ్చి, మళ్లీ తూచ్ అన్నారు. అమరావతి దగ్గర అన్నింటి గురించి మాట్లాడుతున్నారు కానీ, సినిమా పరిశ్రమ గురించి కాదు.
మరి ఇప్పుడు ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను పునరుద్దరించి ఏం చేయాలనుకుంటున్నట్లు? ఎఫ్ డి సి దేనికోసం? సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడానికా? అవయితే ఇప్పటికి చైర్మన్ వున్నా లేకున్నా జరుగుతూనే వున్నాయి? మరి అంబికా కృష్ణ చైర్మన్ గా వచ్చి ఏం చేస్తారు?
ఆంధ్రలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేస్తారా? అలా చేయాలంటే, ఇక్కడి సినిమా జనాలే అక్కడికి వెళ్లాలి. ఆంధ్రలో స్థలాలు కావాలంటే ఇస్తే, తీసుకుంటారు కానీ, ఇక్కడ నుంచి అక్కడకు వెళ్తారా? అన్నది అనుమానమే. మరి ఇలాంటి నేపథ్యంలో ఎఫ్ డి సి ఏం చేస్తుందో? ఆంధ్రలో?