గూగుల్ హీరో మావాడే అంటే మావాడు అంటున్నారు ఎన్టీఆర్ అండ్ బన్నీ ఫ్యాన్స్. గూగుల్ ఏటా కొన్ని గణాంకాలు ప్రకటిస్తుంటుంది. ఆ విధంగా నేషనల్ వైడ్ గా కొన్నింటిపై, కొందరు వ్యక్తులపై గూగుల్ ఎనలటిక్స్ గణాంకాలు ఇచ్చింది కానీ, ప్రాంతీయ హీరోల సంగతి పట్టించుకోలేదు.
అయితే ఎవరికి వారు గూగుల్ లో కొన్ని పేర్లు ఇచ్చి, కంపారిజన్ సెర్చ్ స్టేట్ మెంట్ లు తీసుకోవచ్చు. ఇదంతా గూగుల్ బ్రవుజర్ ముందు కూర్చుని చేసే టెక్నికల్ వ్యవహారం. అయితే నిన్నటికి నిన్న ఇలా కొంతమంది తెలుగు హీరోల పేర్లు ఇచ్చి డేటా తీసి..అదిగో ఎన్టీఆర్ నే 2016లో టాప్ సెర్చ్ డ్ హీరో అన్నారు ఎవరో? అదిగో వార్త అంటే ఇదిగో ట్వీటు అనే జనాలు వెంటనే దాన్ని టపటపా ట్వీట్ చేసేసారు. అది అధికారికమా? కాదా? అన్నది చూడలేదు.
ఇంతలో బన్నీ ఫ్యాన్స్ నిద్రలేచారు. హాత్తెరి..ఇదెక్కడి సెర్చింగు..ఎన్టీఆర్ అని ఇచ్చి ఊరుకుంటే ఎలా? ప్రపంచంలో సవాలక్ష మంది ఎన్టీఆర్ లు వుంటారు. పైగా మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ వుండనే వున్నారు. ఎన్ టి రామారావు జూనియర్, సినిమా ఏక్టర్ అని కొట్టి అప్పుడు చూడండి..ఎవరు లీడ్ లోకి వస్తారో అంటూ, ఆ డేటా కూడా వదిలారు. ఆ డేటా ప్రకారం అల్లు అర్జున్ లీడ్ లోకి వస్తున్నాడు. పైగా ఎన్టీఆర్ అభిమానులు తీసిన డేటా కంపారిజన్ స్టేట్ మెంట్ లో ప్రభాస్ ను లెక్కలోకే తీసుకోలేదంటున్నారు.
పైగా ఎన్టీఆర్ అని పొడి అక్షరాలు కొడితే గూగుల్ ఎన్టీ రామారావు గురించి కాకుండా మరేదో వస్తుందని అందువల్ల కంపారిటివ్ సెర్చ్ స్టేట్ మెంట్ లు తీయాలనుకున్పుడు ఫుల్ క్లారిటీతో, ఇండివిడ్యువల్ అయిడెంటిటీ ఇస్తూ, గూగుల్ లో సెర్చ్ చేస్తే, ఎవరి సత్తా ఎంతో తెలుస్తుందంటున్నారు బన్నీ ఫ్యాన్స్.
ఇంత రగడ పడే కన్నా,గూగుల్ నే ఎన్టీరామారావు జూనియర్, అల్లు అర్జున్ ల్లో ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేసారు అని అడిగి సమాధానం తెప్పిస్తే సరి. 2017 కి ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. డైలీ బ్రౌజర్ ఓపెన్ చేసి, వీలయినపుడల్లా తమ అభిమాన హీరో గురించి ఓసారి సెర్చ్ చేసి వదుల్తుండాలి. ఏమిటో ఈ పిచ్చి.