గోపీచంద్ తో కొత్త డైరక్టర్ తో చేస్తున్న సినిమాకు టైటిల్ వెదుకులాట ప్రారంభమైంది. గోపీచంద్ కు రెండు అక్షరాలు, చివర్న సున్నా వుండే టైటిళ్ల సెంటిమెంట్ ఒకటి వుంది.
యజ్ఞం, లౌక్యం టైటిల్ టైపు అన్నమాట. (శౌర్యం టైటిల్ కూడా సెంటిమెంట్ తో పెట్టిందే) అందుకోసం ప్రస్తుతానికి పంతం అనే టైటిల్ ఒకటి దొరకగానే రిజస్ట్రేషన్ చేయించేసారు. కానీ ఇంకా బెటర్ టైటిల్ ఏమన్నా దొరుకుందా అన్న ఆలోచనలు, చర్చలు అయితే సాగుతున్నాయి.
పంతం టైటిల్ మీద యూనిట్ పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అందుకే మరో టైటిల్ ఏదన్నా దొరకుతుందా అని చూస్తున్నారు. ఏదీ దొరక్క పోతే అప్పుడు పంతం టైటిల్ ఫిక్స్ చేస్తారు.
రవితేజతో బెంగాల్ టైగర్ నిర్మించిన సక్సెస్ ఫుల్ నిర్మాత రాధామోహన్ ఈ సినిమాను అందిస్తున్నారు. చక్రవర్తి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు పని చేస్తున్నారు. గోపీసుందర్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా గోపీచంద్ కు 25వ సినిమా కావడం విశేషం.