ఇండస్ట్రీలో దాదాపు ఇద్దరు ముగ్గురు మినహా అందరు హీరోలు సెటిల్డ్ గా వున్నారు. ఏదో ఒక హిట్ లేదా ఏవరేజ్ ఇచ్చుకుంటూ, చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు అడ్వాన్స్ గా వుంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పైగా వీళ్లందరూ కనీసం పదికోట్ల నుంచి ముఫైకోట్ల వరకు ఓ మార్కెట్ అంటూ ఏర్పాటు చేసుకున్నారు. కానీ హీరో గోపీచంద్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా వుంది. సరైన ప్రాజెక్ట్ లు పడడంలేదు. పడిన ప్రాజెక్టులు పడుకుంటున్నాయి. తీరా లేచిన ప్రాజెక్టులు ఫేర్ చేయడంలేదు. జిల్ సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ సమస్య. అంతకు ముందు పెద్దగా హిట్ లు వున్నాయి అనికాదు. లౌక్యం ముందు భయంకరమైన ఫ్లాపులే పలకరించాయి. లౌక్యంతో ట్రాక్ లో పడ్డాడు అనుకుంటే శౌర్యం తిరుగులేని ఫ్లాప్ గా మిగిలింది.
ఇలాంటి టైమ్ లో రెండు ప్రాజెక్టులు స్టార్ట్ చేసినా అవి రెండూ పడుకున్నాయి. ఆక్సిజన్ సినిమా పూర్తయ్యీ అవ్వనట్లు వుండిపోయింది. ఆరడుగుల బుల్లెట్ విడుదలకు సిద్దంగా వుంది. కానీ విడుదల కాలేకపోతోంది. ఇలాంటి టైమ్ లో గౌతమ్ నందా సినిమా పెద్ద ఆశాదీపంలా కనిపిస్తోంది గోపీచంద్ కు.
సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి దర్శకుడు సంపత్ నంది తెలివిగా ప్లాన్ చేసుకువస్తున్న పబ్లిసిటీ పుణ్యమా అని సినిమాకు కాస్త బజ్ వచ్చింది. విడుదలకు సోలో డేట్ దొరికింది. ఓవర్ బడ్జెట్, అమ్మకాలు, ఓవర్ సీస్ లో సరైన రేటు రాకపోవడం వంటివి నిర్మాత సమస్యలు. హీరోకి సంబంధించినంత వరకు సినిమా హిట్ అనిపించుకుంటే చాలు.
ఆ ఊపుతో ఆక్సిజన్ ముందుగా విడుదలయిపోతుంది. ఇప్పుడు చేతిలో ప్రాజెక్టులు లేవుకానీ, గౌతమ్ నందా హిట్ అనిపంచుకుంటే ప్రాజెక్టులు వస్తాయి. ఇప్పటిదాకా సంపత్ నందికి ఫ్లాపులు అయితేలేవు. మినిమమ్ గ్యారంటీ సినిమాలే అన్నీ. అందువల్ల గోపీచంద్ ఈ సినిమా మీద పూరి ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అనిపించుకుంటే చాలు, బ్రేక్ ఈవెన్ లు అవన్నీ తరువాతి సంగతి. ముందు హీరోగా గోపీచంద్ మళ్లీ ముందుకు పయనించడం ప్రారంభం అవుతుంది. ఏ సంగతీ మరో అయిదు రోజుల్లో తేలిపోతుంది.