జయాపజయాలు ఎవ్వరి చేతుల్లోనూ వుండవు, యాభై రూపాయిలు పెట్టి టికెట్ కొని సినిమా చూసే కామన్ మాన్ జడ్జిమెంట్ కు ఏ స్టార్ అయినా, ఏ స్టార్ డైరక్టర్ అయినా తల వొంచాల్సిందే. అయితే ప్రచారం, సినిమాకు తీసుకువచ్చే బజ్, స్టార్ కు వుండే మార్కెట్, ఇతరత్రా వ్యవహారాలు అన్నీకలిపి తొలి వీకెండ్ కలెక్షన్లను తీసుకువస్తాయి. ప్రతి హీరోకి ఓ రేంజ్ అంటూ వుంటుంది. ఆ రేంజ్ కు ఆధారపడి ఓపెనింగ్స్ వుంటాయి. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు వుంటాయి. తొలిరోజు కలెక్షన్ మొత్తం సినిమా బజ్, హీరో పాపులారిటీ మీదే ఆధారపడి వుంటాయి.
అలాగే ఎంజీలు, ఇతరత్రా వ్యవహారాలు తొలిరోజు కలెక్షన్లలో వుంటాయి. ఆ తరువాత శనివారం, ఆదివారం కలెక్షన్లను మౌత్ టాక్, సమీక్షలు కాస్త ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఈ లెక్కలే హీరో గోపీచంద్ ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ కెరీర్ లో ఎత్తుపల్లాలు రెండూ వున్నాయి కానీ, మరీ వీక్ ఓపెనింగ్స్ ఎప్పుడూలేవు. లౌక్యం హిట్ తరువాత రెండు పరాజయాలు పలకరించినా, కలెక్షన్లు మరీ దారుణం కాదు. అది కూడా తొలి మూడురోజుల్లో.
కానీ గౌతమ్ నందా సినిమా విషయం మాత్రం తేడాగా వుంది. సినిమాకు మాంచి బజ్ వచ్చింది. ఆది నుంచీ ఆ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. సినిమా మేకింగ్ కు, పబ్లిసిటీకి భారీగా ఖర్చుచేసారు. సినిమా ప్రీ రిలీజ్ టాక్ కూడా బాగా వచ్చింది. పైగా సోలోగా బరిలోకి వచ్చింది. అందువల్ల కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వుంటాయని అందరూ అంచనా వేసారు.
కానీ చిత్రంగా తొలిరోజు మూడుకోట్ల షేర్ ను అతికష్టం మీద రాబట్టగలిగారు. మరి ఈ మూడు కోట్లలో కూడా ఫస్ట్ డే టికెట్ కౌంటర్ సేల్ ఎంతన్నది తెలియదు. ఇలా ఎందుకు జరిగింది అన్నదే ఇప్పుడు హీరో గోపీచంద్ కు అంతుపట్టడం లేదని వినికిడి. ఎందుకంటే హీరో కెరీర్, రెమ్యొనిరేషన్ అన్నది ఈ ఓపెనింగ్స్, మార్కెట్ మీదే ఆధారపడి వుంటాయి.
ప్రస్తుతం గోపీ చేతిలో ఇంకా పక్కా అయిన ప్రాజెక్టు లేదు. పైగా రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయి. గౌతమ్ నందా పాజిటివ్ ఫలితం తెచ్చుకుని వుంటే, వాటికి కాస్త ఊపు వచ్చేది. కానీ బ్యాడ్ లక్. అలా జరగలేదు. ఇప్పుడు సరైన బ్యానర్, సరైన డైరక్టర్, సరైన స్క్రిప్ట్ దొరికి తీరాలి. లేదూ అంటే గోపీచంద్ కెరీర్ కష్టాల్లో పడుతుంది.