గోవిందుడు సినిమాకు ఒక పాట బాకీ వుంది. ఆరు పాటలు వుండాలి. కానీ సినిమా విడుదలకు సమయం ముంచుకు రావడంతో, తరువాత కలుపుదాం..ముందు ఇప్పటికి ఇలా కానిచ్చేయండి అని మెగాస్టార్ సలహా ఇచ్చారు. నిర్మాత, దర్శకులు అదే ఫాలో అయ్యారు. ఆరోపాట చిత్రీకరణ అమెరికాలోనా, ఇంకెక్కడైనానా అన్న డిస్కషన్ వుంది.
సినిమా విడుదలైన రెండు రోజులకే ప్రారంభించి, పూర్తి చేసి, సెన్సారుకు ఇచ్చి, 10వ తేదీనాటికి కలిపేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కలిపే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే పాట అంటే మళ్లీ కనీసం కోటి రూపాయిలు ఖర్చు. అసలే సినిమాకు టాక్ అయితే వచ్చింది కానీ, దసరా సెలవులు కాగానే, కలెక్షన్లు ఢామ్ అంటాయని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.
పైగా అన్నింటకి మించి అసలు ఆ పాటను ఎక్కడ జోడిస్తారు? అసలే ప్రధమార్థం ఎడ్లబండికి రోడ్ రోలర్ కట్టినట్లు నడుస్తుంది. సెకండాఫ్ ప్రారంభంలో పాట రాగానే జనం గేట్ల వైపు చూస్తున్నారు. పైగా ఇప్పటికే సినిమా రెండున్నర గంటలు. మరో అయిదు నిమషాలు పెంచుతారా? కేవలం అభిమానులకు తప్ప వేరెవరికీ ఈ పాట కలపడం అన్నది పెద్దగా పట్టదు. అందుకనే పాట కలపాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డారని వినికిడి.