ఇది ఆయనకు కొత్తేమీ కాదు. ఆయనతో సినిమా అంటే హీరోలు హడలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఒకేసారి తన సబ్జెక్టును రెండు మూడు భాషల్లో తెరకెక్కించాలనే దుగ్ధ ఈ మలయాళీది. అలా రూపొందించిన సినిమా ఆకట్టుకోవడం మాట అటుంచితే… ఇలా వేర్వేరు భాషల్లో వేర్వేరు హీరోలతో, వేర్వేరు క్యాస్ట్ అండ్ క్రూ తో సినిమాను రూపొందించాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. రూపొందించడం వరకూ అయితే ఆ ఖర్చు పెడుతున్నాడు కానీ.. స్వయంగా నిర్మాణంలో కూడా భాగస్వామి అయ్యే ఈ దర్శకుడు సదరు సినిమాలు విడుదల చేయడంలో మాత్రం ఫెయిల్యూర్ అవుతున్నాడు!
నితిన్ తో తీసిన ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ విషయంలో జరిగిన వ్యవహారమే నాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ విషయంలో రిపీట్ అవుతోంది. ‘కొరియర్ బాయ్..’ సినిమానీ తెలుగులో, తమిళంలో ఒకేసారి రూపొందించాడు. దాదాపు ఏడాదిన్నర పాటు విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అన్ని వాయిదాలు పడ్డ సినిమాలు ఆకట్టుకోవడం సహజంగానే కష్టం. ఇక ‘సాహసం.. ‘కు తాజాగా మరో డేట్ ఇచ్చారు. ఈ సారైనా విడుదల అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇదే సబ్జెక్టు ను సొంత భాష మలయాళంలో తీస్తున్నాడట గౌతమ్.. అది కూడా పూర్తి అయ్యాకా.. తెలుగు, తమిళ, మలయాళీ వెర్షన్లను ఒకేసారి విడుదల చేస్తానంటాడేమో!
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘పెళ్లి చూపులు’ రీమేక్ రైట్స్ కూడా గౌతమ్ తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నాడట గౌతమ్. తను నిర్మాతగా వ్యవహరించి తన శిష్యుల కు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పే అలవాటుంది గౌతమ్ కు. ఈ సినిమాను కూడా అలాగే తీయనున్నాడట.
మరి తీసిన సినిమాలను విడుదల చేయడం లేదు కానీ.. కొత్త సినిమాల ప్రకటనల్లో మాత్రం గౌతమ్ చాలా ముందుంటున్నాడు. ఆశలావు పీక సన్నం లాగుంది ఈ దర్శక, నిర్మాత పరిస్థితి.